ఏడు మండలాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల మంటలు

ఏడు మండలాలకు బదులు ఐదు ఊళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారంటూ చక్రపాణి వెటకారం చేశారు. చక్రపాణి లేఖలోని విమర్శలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.

Advertisement
Update:2024-07-06 12:01 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పలు సూచనలు చేసింది. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి కూడా కొందరు సూచనలు చేస్తున్నారు. టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి సోషల్ మీడియా ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకి పలు సూచనలు చేశారు. ఈరోజు జరిగే సమావేశంలో తెలంగాణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కాకుండా పాండవుల మాదిరి మావాళ్లు ఐదు గ్రామాలనే అడుగుతున్నారని, వాటిని ఇచ్చేయాలని చంద్రబాబుని కోరారు ఘంటా చక్రపాణి. విభజన చట్టానికి అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిచాలన్నారు. 9, 10 షెడ్యూలులోని సంస్థలను, అందులోని ఉద్యోగులను, వనరులను చట్ట ప్రకారం తీసుకు వెళ్లాలన్నారు. అదే సమయంలో తేడా వస్తే మాత్రం తెలంగాణ సమాజం తెగిస్తుందని హెచ్చరించారు చక్రపాణి. ఈ సారి మళ్ళీ తెగేదాకా కొట్లాడుతుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఇలాంటి అవకాశం, గౌరవం ఉండేదో లేదో తెలియదని అంటున్న చక్రపాణి.. రేవంత్ రెడ్డికి పెద్దన్నలా వ్యవహరించాలని చంద్రబాబుకి సూచించారు.


చక్రపాణి లేఖలోని విమర్శలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఏడు మండలాలకు బదులు ఐదు ఊళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారంటూ చక్రపాణి వెటకారం చేశారు. అయితే గతంలోనే ఆ పంచాయితీ తెగిపోయిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. కేసీఆర్ కూడా ఏడుమండలాల విలీనం ముగిసిపోయిన ముచ్చట అని తేల్చేశారని, ఇప్పుడు చక్రపాణి దెప్పిపొడవడంలో అర్థం లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నాడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులో ఏడు మండలాల ప్రస్తావన తేలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్ ద్వారా ఆ పని పూర్తి చేశారని గుర్తు చేశారు.. ఈ విషయంలో చక్రపాణి.. బీఆర్ఎస్, బీజేపీ నేతల్ని నిలదీయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదని ఆ పార్టీ నుంచి ట్వీట్ వేశారు నేతలు.



Tags:    
Advertisement

Similar News