కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
హామీల అమలు జాప్యంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరుకు అమలు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఎందుకు నెరవేర్చలేక పోతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆయన తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం విదేశాల్లో అధ్యయనం చేయడానికి వెళ్లే ముందు.. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న వారి పరిస్థితిని తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిధుల చెల్లింపులో జాప్యానికి గల కారణాలేంటో స్పష్టం చేయకపోతే గందరగోళం నెలకొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ప్రచారం చేయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ రహస్య ఎజెండాతో పనిచేస్తున్నాయంటూ సాంబశివరావు తెలిపారు.