రేవంత్ రెడ్డిని సైలెంట్‌గా సైడ్ చేస్తున్న సీనియర్ నేతలు?

సీనియర్ నాయకులు సైలెంట్‌గా ఉంటూనే రేవంత్‌కు చెక్ పెట్టే పనులు చేస్తున్నారు. అధిష్టానం నుంచి అండదండలు ఉన్నాయని చెప్పుకునే రేవంత్‌ను నెమ్మదిగా సైడ్ చేస్తున్నారు.

Advertisement
Update:2022-09-28 08:31 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, పార్టీలోని సీనియర్ నాయకులు మధ్య గ్యాప్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రేవంత్ మీద బహిరంగంగా ఎవరూ కామెంట్లు చేయకపోవడంతో సీనియర్లు సైలెంట్ అయ్యారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరేలా ఉంది. సైలెంట్‌గా ఉంటూనే రేవంత్‌కు చెక్ పెట్టే పనులు చేస్తున్నారు. అధిష్టానం నుంచి అండదండలు ఉన్నాయని చెప్పుకునే రేవంత్‌ను నెమ్మదిగా సైడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్‌పై విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని భావించిన సీనియర్లు.. నెమ్మదిగా తమకు తెలిసిన దారుల్లో ఏఐసీసీలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సీనియర్లు టీపీసీసీ కమిటీల విషయంలో రేవంత్ నిర్ణయాన్ని కూడా మార్చేసి తమ పంతం నెగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఏఐసీసీ, టీపీసీసీ ప్రతినిధుల కోసం రాష్ట్రం నుంచి 272 మందితో కూడిన భారీ కమిటీని ప్రకటించారు. దానికి ముందు 238 మంది ప్రతినిధులు, 15 శాతం ఎక్స్అఫిషియో సభ్యులతో కూడిన జాబితాను రేవంత్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువగా తన వర్గం మనుషులే ఉండేలా చూసుకున్నారు. ముఖ్యంగా ప్రతీ నియోజకవర్గంలో తన వ్యక్తి ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఈ జాబితాను ముందుగా భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తుది ఆమోదం కోసం పంపారు. తన వర్గానికి జాబితాలో చోటు ఖాయమనే ధీమాతో రేవంత్ రెడ్డి ఉన్నారు. తీరా రాష్ట్రానికి వచ్చిన జాబితా చూసి రేవంత్ ఆశ్చర్యపోయారు. చాలా నియోజకవర్గాల్లో తన అనుచరులకు ప్రాతినిథ్యమే లేకుండా చేసినట్లు గుర్తించారు. ఈ కమిటీల విషయంలో రేవంత్ పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. అయితే తనకు రాష్ట్రంలో అడ్డు తగులుతున్న సీనియర్లే ఢిల్లీలో పావులు కదిపినట్లు రేవంత్ అనుమానిస్తున్నారు.

ఢిల్లీకి పంపిన టీపీసీసీ ప్రతినిధుల జాబితాలో సీనియర్ నాయకులు కొందరు లాబీయింగ్ చేసి పేర్లు మార్చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సన్నిహితంగా ఉండే యాంటీ రేవంత్ బ్యాచ్.. ఈ పేర్ల మార్పులో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. రేవంత్ వర్గానికి చోటు కల్పించకపోవడంపై ఎవరూ నోరు మెదపక పోయినా.. అసలు పార్టీలో క్రియాశీలంగా లేని పలువురికి జాబితాలో చోటు దక్కడంపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్లు తమ అనుచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా.. వారి పేర్లు చేర్చారని మండిపడుతున్నారు. అయితే రేవంత్‌ను సైడ్ చేయడానికి ఇలా చేశారని తెలుస్తోంది. రేవంత్ అధికారాలకు ఢిల్లీ నుంచి కత్తెర వేయడంలో సీనియర్లు సఫలమవుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు.

మరోవైపు మునుగోడు ప్రచారం విషయంలో కూడా రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి సహకారం అందడం లేదని తెలుస్తోంది. రేవంత్ అక్కడకు వెళ్లినా.. సీనియర్లు మాత్రం ఆయన వెంట వెళ్లడం లేదు. సీనియర్ నాయకులందరూ ఎవరి వారే యమునా తీరే అనే చందంగా వ్యవహరిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క కూడా విడిగానే మునుగోడు వెళ్లి సమావేశాలు పెడుతున్నారు. ఇక సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు అసలు మునుగోడు విషయమే పట్టించుకోవడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మొదటి నుంచి ఆ ఉపఎన్నిక విషయంలో దూరంగానే ఉంటున్నారు. ఓ వైపు రేవంత్ రెడ్డి మునుగోడులో ఎలాగైనా గెలవాలని, సీనియర్లు అందరూ ఐక్యంగా ఉన్నామని చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం అలా కనపడటం లేదు. మునుగోడులో గెలిస్తే అది రేవంత్‌కు ప్లస్ అవుతుందనే కొందరు సీనియర్లు అతడిని సైడ్ చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు తమ విభేదాలతో దూరం చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News