కాంగ్రెస్ కమిటీల్లో చోటు దక్కక సీనియర్ల నారాజ్
ఇటీవల ఆ పార్టీలో సీడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో స్థానం లభించింది.
టీ కాంగ్రెస్ ఒక వివాదం నుంచి మరో వివాదంలోకి ప్రయాణం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఇంటికి రెండు టికెట్లు ఇవ్వలేమని గొడవ, తర్వాత పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు టికెట్ల గురించి రగడ, దరఖాస్తుదారుల్లో నుంచి క్యాండిడేట్ ఎంపిక కోసం అప్పటికప్పుడు లిస్ట్ చేతికిచ్చి మూడు పేర్లకు టిక్ పెట్టమన్నారని రుసరుసలు.. ఇలా రోజుకో తగవు కింద వ్యవహారం మారింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కమిటీల్లో స్థానం దక్కకపోవడంపై సీనియర్లు నారాజ్ అవుతున్నారు.
ఆ ముగ్గురికే చోటు
ఇటీవల ఆ పార్టీలో సీడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహకు చోటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో స్థానం లభించింది. తర్వాత 16 మందితో ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిటీలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెలంగాణ నుంచి చోటిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీలోని మిగిలిన సీనియర్లు భగ్గుమంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీ. హనుమంతరావు, జానారెడ్డి, చిన్నారెడ్డి వంటి వారంతా పదవులు ఆశించినా అధిష్టానం మొండిచేయి చూపించింది. దీంతో వీరంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నా సీనియార్టికేదీ విలువ
నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఈసీతోపాటు తెలంగాణ ఎన్నికల కమిటీలోనూ కీలక బాధ్యతలు అప్పగించి, తనకు మాత్రం ఏ అవకాశం ఇవ్వకపోవడాన్ని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను తాజాగా కలిసి అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆత్మగౌరవం లేనప్పుడు పార్టీలో ఉండలేనని, రాజీనామా చేస్తానని ఘాటుగానే చెప్పినట్లు తెలిసింది. మరోవైపు చిన్నారెడ్డి కూడా అలకపాన్పు ఎక్కారు. ఆయన్నూ పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. జానారెడ్డి, వీహెచ్‌లాంటి మరికొందరు నేతలు లోలోపల అసంతృప్తి ఉన్నా.. పైకి ప్రదర్శించకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
*