నన్నూ తిట్టారు.. నేనెవరికి చెప్పుకోవాలి..

హైకమాండ్ సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అదే జరిగితే.. బయట ఎవరూ మాట్లాడరని అంటున్నారు వీహెచ్. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని చెప్పారు వీహెచ్.

Advertisement
Update:2022-08-19 19:06 IST

కాంగ్రెస్ సీనియర్లలో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి అంతా మునుగోడు ఉప ఎన్నిక వేళ బయటపడుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా కేవలం మునుగోడు వ్యవహారమే అనుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్లు తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది కుటుంబ వ్యవహారం అనుకున్నా.. నిన్న మర్రి శశిధర్ రెడ్డి, నేడు వి.హనుమంతరావు.. ఇలా సీనియర్లంతా తమ ఆవేదన, అసంతృప్తిని బయటపెట్టేందుకు ఏమాత్రం మొహమాట పడటంలేదు, అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

అధిష్టానం జోక్యం అవసరం..

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికం. అలకలు, అసంతృప్తులు ఎప్పుడూ ఉండేవే. అయితే అధిష్టానం పిలుపులు, బుజ్జగింపులు కూడా అంతే సాధారణం. కానీ రేవంత్ రెడ్డి చేతికి స్టీరింగ్ ఇచ్చిన తర్వాత ఈ బుజ్జగింపులు తగ్గిపోయాయి. ఉంటే ఉండండి, లేకపోతే పొండి అనే మాటలు వినపడుతున్నాయి. దీంతో సహజంగానే బుజ్జగింపులకు అలవాటు పడిన సీనియర్లు నొచ్చుకుంటున్నారు. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం, నాయకుల్ని పిలిచి మాట్లాడాలన్నారు సీనియర్ నేత వి.హనుమంతరావు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఆశ నాయకులందరికీ ఉందని, దాన్ని అధిష్టానం అర్థం చేసుకోవాలన్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఇప్పుడు ఆవేదనతో చెప్పాడని, దాన్ని అధిష్టానం సరిదిద్దాలని సూచించారు. "నన్ను కూడా గతంలో తిట్టారు, అవమానపరిచారు, నేనెవరికి చెప్పుకోవాలి" అన్నారు వీహెచ్.

మీరు మాట్లాడితే బయట మాట్లాడరు..

హైకమాండ్ సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అదే జరిగితే.. బయట ఎవరూ మాట్లాడరని అంటున్నారు వీహెచ్. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని చెప్పారు వీహెచ్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అసంతృప్తుల గురించి మాట్లాడతాననడం సరికాదన్నారు. కనీసం కేసీ వేణుగోపాల్ తమ ఆవేదన చెప్పుకుంటామంటే టైమ్ కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధిష్టానం ఈ విషయంపై దృష్టిపెట్టాలని, అసంతృప్తులను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పారు వీహెచ్.

Tags:    
Advertisement

Similar News