శరత్ బాబు కన్నుమూత.. నెలరోజులు మృత్యువుతో పోరాటం
గత నెలలోనే ఆయన చనిపోయినట్టు వార్తలు రాగా కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన కోలుకుంటున్నట్టు తెలిపారు. అయితే నెల రోజులపాటు ఆస్పత్రి బెడ్ పైనే శరత్ బాబు మృత్యువుతో పోరాడి ఓడారు.
50ఏళ్లపాటు తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన నటుడు శరత్ బాబు తుదిశ్వాస విడిచారు. ఇదివరకే ఆయన మరణంపై పుకార్లు షికార్లు చేసినా.. ఈరోజు ఆయన మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 20న అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత నెలలోనే ఆయన చనిపోయినట్టు వార్తలు రాగా కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన కోలుకుంటున్నట్టు తెలిపారు. అయితే నెల రోజులపాటు ఆస్పత్రి బెడ్ పైనే ఆయన మృత్యువుతో పోరాడి ఓడారు.
శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. ఆయన పూర్తి పేరు సత్యనారాయణ దీక్షితులు కాగా.. సినిమాల్లోకి వచ్చాక శరత్ బాబుగా మారారు. కాలేజీ రోజుల్లో పోలీస్ అవుదామనుకున్నా.. కంటిచూపు దెబ్బతినడంతో ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే సినిమాల్లో కూడా ఆయన ఎప్పుడూ కళ్లజోడుతోనే కనిపించేవారు.
1973లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. దాదాపు 50 ఏళ్లపాటు సినిమాల్లో కనిపించారు. ఆమధ్య పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో కనిపించిన శరత్ బాబు, నరేష్ కొత్త సినిమా మళ్లీపెళ్లిలో కూడా నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 220 సినిమాల్లో నటించారు శరత్ బాబు. సినిమాల్లో స్థిరపడే రోజుల్లోనే ఆయన సీనియర్ నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తానసలు రమాప్రభను వివాహం చేసుకోలేదని శరత్ బాబు చెప్పడం విశేషం. స్నేహ నంబియార్ ని కూడా వివాహం చేసుకున్న శరత్ బాబు ఆ తర్వాత విడాకులిచ్చారు.