ఎయిర్‌పోర్టులా మారిపోనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. రూ. 653 కోట్లు ఖర్చు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 1.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సరికొత్త కాంప్లెక్స్ నిర్మించనున్నారు.

Advertisement
Update:2022-07-15 17:39 IST

ఇండియాలో రైల్వేస్టేషన్లు అనగానే అరకొర సౌకర్యాలతో.. అపరిశుభ్రమైన పరిసరాలు, ప్లాట్‌ఫామ్స్‌ గుర్తుకు వస్తాయి. ఇండియన్ రైల్వేస్ వీఐపీ లాంజ్‌ల పేరుతో కొన్ని సౌకర్యాలను మెరుగుపరిచింది. కానీ, అవి సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. గంటకు కొంత చార్జీ వసూలు చేస్తుంటారు. అయితే రైల్వేశాఖ ఇటీవల హైటెక్ రైల్వేస్టేషన్లపై దృష్టి పెట్టింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లోని రైల్వేస్టేషన్లను ఎయిర్‌పోర్ట్ లుక్ వచ్చేలా పునర్నిర్మిస్తోంది.

గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ను తొలిసారి భారీ ఖర్చుతో ఎయిర్‌పోర్ట్ లుక్ వచ్చేలా మార్పులు చేశారు. గతేడాది బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే టెర్మినస్‌ను ఎయిర్‌పోర్టులా తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన కూడలి జబల్‌పూర్‌ను కూడా అత్యంత ఆధునికంగా మార్చేశారు. ఇక ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖ‌ల‌ను పూర్తిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. రూ. 653 కోట్ల వ్యయంతో.. ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి ఈ నెలాఖరున టెండర్లు పిలవనున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 1.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సరికొత్త కాంప్లెక్స్ నిర్మించనున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్, స్కై కాంకోర్స్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే సౌకర్యాలు కల్పించనున్నారు. 108 మీటర్ల వెడల్పుతో రెండస్తుల స్కై కాంకోర్స్ ఇందులో ముఖ్యమైన నిర్మాణమని అధికారులు తెలిపారు. ఏడాదిలోగా ఈ నిర్మాణం పూర్తి చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

కింది అంతస్తు పూర్తిగా ప్రయాణికుల వెయిటింగ్ కోసం ఉపయోగిస్తారు. రెండో అంతస్తు రూఫ్ టాప్ ప్లాజాలాగా నిర్మించనున్నారు. ఇప్పటికే ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల‌న్నింటినీ తొలగించి.. ఈ భవనాలు నిర్మించనున్నారు. ఆ తర్వాత మళ్లీ లిఫ్టులు, ఎస్క్‌లేటర్లు, బ్రిడ్జిలు తిరిగి నిర్మిస్తారని సికింద్రబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా చెప్పారు. అరైవల్/డిపార్చర్ ప్రయాణికులు కలువకుండా.. పూర్తిగా విమానాశ్రయం తరహాలోనే విభజించనున్నట్లు ఆయన తెలిపారు.

ప్లాట్‌ఫామ్ నెంబర్ 1, 10 నేరుగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్లాట్‌ఫామ్ 2 నుంచి 9 వరకు చేరుకోవాలంటే స్కై కాంకోర్స్ నుంచి వెళ్లాల్సిందే. అయితే రైలు దిగి వచ్చే ప్రయాణికులు మాత్రం మైనస్ 1 లెవెల్‌లో ఏర్పాటు చేసే ఎగ్జిట్ బ్లాక్స్ ద్వారా బయటకు రావల్సి ఉంటుంది. ఆ మార్గం నుంచి వాళ్లు స్టేషన్ బయట ఉండే పికప్ పాయింట్ వద్దకు చేరుకుంటారు.

ఇక ఇప్పటికే ఆల్ఫా కేఫ్ నుంచి రేతిఫైల్ వరకు ఉన్న 60 ఫీట్ల వెడల్పు రోడ్డును 120 మీటర్ల మేరకు పెంచనున్నారు. అక్కడి వరకు రెండు వాక్‌వేలు నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ వాక్‌వేలకు సమాంతరంగా ట్రావెలేటర్స్ కూడా ఉండటం వల్ల పెద్ద వయసు, నడవలేని వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పారు. రైల్వే శాఖ ప్రణాళిక మేరకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కూడా తగిన ఏర్పాట్లు చేయడానికి పచ్చజెండా ఊపింది. ఉత్తరం వైపు ఉన్న బస్ బేను.. పాత గాంధీ ఆసుపత్రి వైపు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రెండు వైపులా ఉన్న మెట్రోస్టేషన్లకు స్కై వేలు నిర్మించడానికి కూడా చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News