సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య
సికిందరాబాద్ లోని 'ఈ బైక్' షో రూంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మరణించిన వారి సంఖ్య 8కి చేరింది. షో రూంలో బ్యాటరీలు పేలి పైనున్న హోటల్ కు అగ్ని వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.
సికిందరాబాద్ ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో జరిగిన ఆగ్నిప్రమాదంతో షో రూం పైన ఉన్న హోటల్ కు అగ్ని వ్యాపించి 7గురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఈ రోజు ఆస్పత్రిలో మరణించినట్టు సమాచారం.
ఓ బిల్డింగ్ సెల్లార్ లో నిర్వహిస్తున్న ఈ స్కూటర్ షో రూంలో బ్యాటరీలు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు షో రూం పైన ఉన్న రూబీ లాడ్జీకి వ్యాపించడంతో లాడ్జిలో ఉన్న వాళ్ళు 7గురు సజీవ దహనమయ్యారు. మరి కొంత మంది బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు పది మందిని పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు కాపాడారు.
నిబందనలకు విరుద్దంగా లాడ్జీలో ఒకే దారి ఉన్నట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. లోపలికి పోవడానికి, బైటికి రావడానికి ఒకే దారి ఉండటంతో లాడ్జీలో ఉన్నవాళ్ళకు తప్పించుకునే మార్గం లేకుండా పోయిందన్నారు.
అధికారులు లాడ్జీని సీజ్ చేశారు. నిబందనలకు విరుద్దంగా సెల్లార్ లో ఈ బైక్ ల షో రూం నిర్వహిస్తున్న యజమాని రంజిత్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.