రాజకీయ పార్టీల రహస్య ప్రేమలు
ఆ రెండు పార్టీలదీ చీకటి దోస్తానా అంటూ మరో పార్టీకి చెందిన నేతలు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏ పార్టీకి ఏ పార్టీతో లోపాయికారీ ఒప్పందం ఉందో లేదో తెలియదు కానీ, జనానికి మాత్రం ఈ పార్టీల సోపతి మాటలు ఏంటో అర్థంకాక మతిపోతోంది.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే రాజకీయం రంజుగా మారుతోంది. ప్రధాని మోడీ వరుస పర్యటనల ఆ సందర్భంలో నేరుగా సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించారు. రివర్స్ కౌంటర్లతో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు బీజేపీని, ప్రధాని మోడీని చెడుగుడు ఆడేస్తున్నారు. కాకపోతే ఈ నేతల కామెంట్లలో ఒక్కటి మాత్రం జనాన్ని బాగా అయోమయంలోకి నెడుతోంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఆ రెండు పార్టీలదీ చీకటి దోస్తానా అంటూ మరో పార్టీకి చెందిన నేతలు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏ పార్టీకి ఏ పార్టీతో లోపాయికారీ ఒప్పందం ఉందో లేదో తెలియదు కానీ, జనానికి మాత్రం ఈ పార్టీల సోపతి మాటలు ఏంటో అర్థంకాక మతిపోతోంది.
బీజేపీ, బీఆర్ఎస్ భాయీ భాయీ అంటున్న కాంగ్రెస్
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ భాయీభాయీనే అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇక్కడ గల్లీలో తిట్టుకుంటారని, ఢిల్లీకి పోయి బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఒకరినొకరు కౌగిలించుకుంటారని ఆరోపిస్తుంది. అందుకే దూకుడుగా పార్టీని తీసుకెళ్తున్నబండి సంజయ్‌ను పక్కనపెట్టి కిషన్‌రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారని, తద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీని నెమ్మదింపజేసేలా ఒప్పందం జరిగిందనీ కాంగ్రెస్ వర్గాలు విశ్లేషించాయి. రేపు కేంద్రంలో బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గినా బీఆర్ఎస్ మద్దతివ్వడం ఖాయమనీ హస్తం పార్టీ జోస్యం చెబుతోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది చీకటి దోస్తానా అంటున్న బీజేపీ
మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలతో ముందుకెళ్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో తమను ఓడించడానికి కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ డబ్బు సాయం చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోడీయే నిన్న నిజామాబాద్ సభలో విమర్శించారు కూడా. అక్కడ బీఆర్ఎస్ డబ్బులతో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో అందుకు సాయంగా బీఆర్ఎస్ గద్దె ఎక్కడానికి తనవంతు సహకారం అందిస్తుందని మోడీ ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్, కమలం కలిసిపోయాయంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ నేతలేమో తెలంగాణలో తమను అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని.. ఎలాగైనా కుట్ర చేసి దించాలనే ఉద్దేశంతో బీజేపీ, కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే ఆ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకోకుండా కేవలం తమనే లక్ష్యంగా చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు.