నెలాఖరుకు 'ఇందిరమ్మ' అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేయాలి

14న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో సహపంక్తి భోజనాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-11 20:04 IST

ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. వాటిని పరిశీలించి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఐదు వందల మందికి ఒక సర్వేయర్‌ను నియమించాలని, సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సర్వే చేసే గ్రామంలో ముందు రోజే చాటింపు వేసి ప్రజలందరికీ సమాచారం ఇవ్వాలన్నారు. ఏ ఒక్క చిన్న పొరపాటుకు తావివ్వొద్దని, ఒక్క అప్లికేషన్‌ కూడా విడిచి పెట్టకుండా సర్వే చేయాలన్నారు. ఇందిరమ్మ అప్లికేషన్‌ల సర్వే పై ప్రతిరోజు కలెక్టర్లు సమీక్షించాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు నిర్మించబోతున్నామని, ఈ పథకం నిరంతర ప్రక్రియ అన్నారు.

తమ ప్రభుత్వం మెస్‌ చార్జీలను 40 శాతం పెంచిందని, దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి సరుకుల క్వాలిటీ, క్వాంటిటీపై దృష్టి సారించాలన్నారు. ఈనెల 14న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఎల్లుండికి పూర్తి చేయాలన్నారు. 1.16 కోట్ల కుటుంబాలకు గాను 1.12 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయ్యిందన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ -2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News