సినీ పరిశ్రమకు సంబంధించిన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమస్యల్లో ఇరుక్కున్న మంత్రి కొండా సురేఖ అధికారాలకు సొంత పార్టీ పెద్దల కత్తెర పెట్టారా? అంటే కాంగ్రెస్ ప్రముఖులు అవుననే చెప్తున్నారు. అక్కినేని కుటుంబం సహా పలువురు హీరోయిన్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడింది. సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆమె మాట్లాడే క్రమంలో కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ ఆ వివాదంలోకి సినీ ప్రముఖులను లాగారు. ఇది కాస్త కాంగ్రెస్ హైకమాండ్ కు చేరింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మందలించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు ఇంకో అడుగు ముందుకేసి ఆమెతో రాజీనామా చేయిస్తారని కూడా చెప్తున్నారు. ఇందులో ఆమె రాజకీయ ప్రత్యర్థులకన్నా సొంత పార్టీ నేతలు, సొంత జిల్లా నేతలే ముందున్నారని గాంధీ భవన్, సెక్రటేరియట్ లో ఎవరిని అడిగినా చెప్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు సార్లు ఆమె మీడియా ముందు మాట్లాడి వివాదంలో మరింతగా చిక్కుకుపోయారు. శనివారం సెక్రటేరియట్ కు వచ్చిన మంత్రి కొండా సురేఖ తెలంగాణలో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహించారు. సాధారణంగా ఈ రివ్యూను మంత్రి లీడ్ చేయాలి. మంత్రికి అవసరమైన సహాయ సహకారాలు మాత్రమే ఆమె పేషి సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు ఇవ్వాలి. సెక్రటేరియట్ లోని అటవీ మంత్రిత్వ శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఈ రివ్యూలో మంత్రి కొండా సురేఖ జస్ట్.. గెస్ట్ రోల్ కు పరిమితం అయ్యారు. ఆమె ఓఎస్డీనే అన్నీ తానై రివ్యూను నడిపించారు. ఇదే రివ్యూలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నా మంత్రి ఓఎస్డీ ఆల్ రౌండర్ రివ్యూ నడిపించారు. దీంతో ఆమె సొంత శాఖలోనూ వేటా.. అధికారాలకు కత్తెర వేశారా అనే చర్చ జోరుగా సాగుతోంది.