తెలంగాణ వ్యవసాయ విధానాలను ఆకాశానికి ఎత్తేసిన శాస్త్రవేత్త స్వామినాథన్
తెలంగాణలో అమలు చేస్తున్న పలు పథకాల గురించి విన్నానని, అవి రైతులకు ఎంతో భరోసాను అందిస్తున్నాయంటూ ఆకాశానికి ఎత్తేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పాటిస్తున్న వ్యవసాయ విధానాలు అద్భుతంగా ఉన్నాయి. రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు పథకాల గురించి విన్నానని, అవి రైతులకు ఎంతో భరోసాను అందిస్తున్నాయంటూ ఆకాశానికి ఎత్తేశారు. త్వరలోనే రాష్ట్రానికి వచ్చి వ్యవసాయ ప్రగతిని స్వయంగా చూస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం తమిళనాడుకు వెళ్లాయి. చెన్నైలోని రత్ననగర్‌లో ఉన్న స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను సందర్శించారు.
స్వామినాథన్ ఇంటికి వెళ్లిన మంత్రి, బృంద సభ్యులు దాదాపు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌ను సత్కరించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ ప్రగతి నివేదికను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు అవుతున్న రైతు పథకాల గురించి అవగాహన ఉందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ చైర్మన్‌గా ఉన్న రోజుల్లోనే ఈ లాంటి పథకాలపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. నా ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే తెలంగాణకు వచ్చి.. అక్కడ అమలు జరుగుతున్న పథకాలను పరిశీలిస్తానని 98 ఏళ్ల స్వామినాథన్ తెలిపారు.
హరిత విప్లవ పితామహులైన మీ స్పూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్లు స్వామినాథన్‌కు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంట దిగుబడుల కొనుగోళ్లు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహకాలు, రాయితీపై ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ మానవాళిని ప్రభావితం చేసిన 20 బృహత్ పథకాల్లో రైతు బంధు, రైతు బీమా ఉన్నట్లు తెలిపారు.
వయోభారం మీదపడినా.. తెలంగాణ వచ్చి పథకాలను పరిశీలిస్తానని చెప్పడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 2004లో యూపీఏ హయాంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా స్వామినాథన్ ప్రతిపాదించిన పలు సూచనలు యూపీఏ ప్రభుత్వం, ఆ తర్వాత మోడీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయనకు చెప్పారు. దేశంలో రైతు కేంద్రంగా గొప్ప మార్పు రావాలని, కేసీఆర్ నేతృత్వంలో ఆ దిశగా దేశం ఆలోచిస్తున్నదని మంత్రి వివరించారు. ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.