తెలంగాణలో కొత్త యూపీఐ పేమెంట్ 'రేవంత్ పే'..
రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి అంటూ మంత్రి కేటీఆర్ పంచ్ లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా 'రేవంత్ పే' అంటూ మరో సెటైర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లకు రేటు కట్టిందనే ప్రచారం జోరుగా వినపడుతోంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఆంతర్యం కూడా అదేనంటున్నారు. ఢిల్లీ వార్ రూమ్ మీటింగ్ లో కూడా ఇదే వ్యవహారం హైలైట్ గా మారింది. స్వయానా కాంగ్రెస్ పార్టీ నేతలే టికెట్ల అమ్మకాలపై రగిలిపోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడే టికెట్లు అమ్ముకుంటే ఇక అడిగేదెవరు అని అంటున్నారు పార్టీ నేతలు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని రేటెంత రెడ్డి అంటూ మంత్రి కేటీఆర్ పంచ్ లతో విరుచుకుపడిన విషయం కూడా తెలిసిందే. తాజాగా 'రేవంత్ పే' అంటూ మరో సెటైర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గూగుల్ పే, ఫోన్ పే లాగా.. ఇప్పుడు 'రేవంత్ పే' తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. రేవంత్ పే అంటూ క్యూఆర్ కోడ్ ని కూడా జతచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎలాంటి కాంగ్రెస్ పార్టీ చివరకు ఎలా అయిపోయిందంటూ దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. రాజకీయాలంటే కేవలం వ్యాపారం, డబ్బు సంపాదన అనుకునే రేవంత్ రెడ్డి చేతుల్లో కాంగ్రెస్ పార్టీని పెట్టారని, అందుకే ఆ పార్టీ తెలంగాణలో పూర్తిగా పతనం అయిపోయిందన్నారు శ్రవణ్.
చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు శ్రవణ్. బివేర్ ఆఫ్ 'రేవంత్ పే' అంటూ ఆయన వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇలాంటి వారి చేతుల్లోకి తెలంగాణ వెళ్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్నారాయన. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ మోసపు హామీల మాయలో పడిపోవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లు, రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారని హెచ్చరించారు శ్రవణ్.