మళ్లీ తెరపైకి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు

ఏడాది తర్వాత లిఫ్ట్‌ స్కీములపై కదలిక

Advertisement
Update:2024-11-27 20:46 IST

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగున పడిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఏడాది తర్వాత ఆ రెండు లిఫ్ట్‌ స్కీములను చేపట్టనున్నట్టు ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. బుధవారం జలసౌధలో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, లిఫ్ట్‌ స్కీములపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన సమీక్షించారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభం కాని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. సింగూరు, మంజీరా రిజర్వాయర్లకు గోదావరి నీటిని తరలిస్తామన్నారు. నిజాంసార్‌ కు గోదావరి జలాలతో కనెక్ట్‌ చేస్తామన్నారు. సింగూరులో పూడిక తొలగించే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రాజెక్టు కాల్వలు లైనింగ్‌ చేసేందుకు టెండర్లు పిలువాలన్నారు. పెద్దారెడ్డి లిఫ్ట్‌ పనులను డిసెంబర్‌ నెలాఖరులోపు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. రూ.660 కోట్ల అంచనాతో ఈ లిఫ్ట్‌ స్కీం చేపడుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిలిచిపోయిన ప్యాకేజీ 19ఏ తో పాటు 17, 18, 19 ప్యాకేజీల పనుల్లో వేగం పెంచాలన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి నీళ్లిచ్చే నల్లవాగు మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాల్వకు రిపేర్లు చేయించాలని, 38 చెరువులకు అవసరమైన రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. అదే నియోజకవర్గంలో కారముంగి లిఫ్ట్‌ స్కీం పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇరిగేషన్‌ స్పెషల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఈఎన్సీలు అనిల్‌ కుమార్‌, నాగేందర్‌ రావు, సీఈ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News