రైతుబంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బోగస్
పథకాలను అమలు చేయకుండా తెరపైకి రోజుకో డైవర్షన్ హై 'డ్రామా'...420 హామీల అమలు చేతకాక రోజుకో డ్రామా ఆడుతున్నారన్న లక్ష్మణ్
రుణమాఫీ చేస్తామని, రైతుబంధు పెంచి ఇస్తామని చేసిన వాగ్దానాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఎగొట్టిందని బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'రైతులకు రైతుబంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బోగస్ అయిపాయె' అని ఎద్దేవా చేశారు. పంటలు కొనే దిక్కు లేదు.. పత్తి రైతులకు మద్దతు ధర లేదన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే సమయంలో రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చారా? రుణమాఫీకి, దీనికి లింక్ పెట్టడమేంటి? అని ప్రశ్నించారు.
అధికారంలోకి రావడానికి మాయ మాటలు చెప్పారు. రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రోజుకో మాట మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పే దమ్ముందా? అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. గత ఏడాది శాసనసభ ఎన్నికలకు ముందు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి విద్యార్థులకు నమ్మబలికారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చిన పది నెలల్లో కాంగ్రెస్ నాయకులు 25 విదేశీ పర్యటనలు చేశారు. రైతుబంధు, రుణమాఫీకి పైసలు లేవు. కానీ మీ విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు. పథకాలను అమలు చేయకుండా తెరపైకి రోజుకో డైవర్షన్ హై 'డ్రామా' చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు. తేమ పేరుతో అడ్డగోలు కొర్రీలు పెట్టి పత్తి కొనకుండా నిరాకరిస్తున్నారు. 420 హామీల అమలు చేతకాక రోజుకో డ్రామా ఆడుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.