రైతు బతుకు మార్చిన గేమ్ ఛేంజర్ రైతుబంధు
కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుందని కేటీఆర్ సవాల్
సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇచ్చామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శాసనసభలో రైతు భరోసా విధివిధానాలపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019-20 లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలున్నది. 2020-21 లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలని నివేదికలో చెప్పారు. రైతు బంధు ఇవ్వడం వల్లనే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన నోట్ స్పష్టం చేస్తున్నది.
4.50 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం. పోడు పట్టాలున్న గిరిజనులకు రైతు బంధు ఇస్తారో.. లేదో ప్రభుత్వం చెప్పాలి. రైతుబంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. లేకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మంత్రి చెప్పేవారు కాదు. తెలంగాణలో పీఎం కిసాన్ సమ్మాన్ 20 శాతం మంది రైతలకే వస్తున్నది. రైతుబంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు? పత్తి, కంది 8 నెలల పంట.. ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా? రెండు పంటలకు ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పామాయిల్, మామిడి, ఉద్యాన పంటలకు రైతు భరోసా ఇస్తారా? 3 పంలు సాగు చేసే రైతులకు మూడు విడతలుగా ఇస్తారా? మూడో పంటకు ఇవ్వాలని గతంలో రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు పది రోజలు పొడిగించాలన్నారు. ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మిషన్ భగీరథపై చర్చ చేపట్టాలని కోరారు. నల్గొంగ జిల్లా అభివృద్ధిపై కూడా ఒకరోజు చర్చ చేపట్టాలన్నారు. గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉన్నది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా? బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. సభ వాయిదా వేసి నల్గొండ జిల్లాకు వెళ్లి పరిస్థితులు పరిశీలిద్దాం. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తుంది. రైతుబంధు మీద కాంగ్రెస్ విపరీతమైన దుష్ప్రచారం చేసింది. రైతు బతుకు మార్చిన గేమ్ ఛేంజర్ రైతుబంధు అని కేటీఆర్ అన్నారు.
ఇక రుణమాఫీ గురించి కూడా కాంగ్రెస్ నేతలు తలోవిధంగా మాట్లాడుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 70 శాతం రుణమాఫీ జరిగిందంటున్నారు. మరో మంత్రి వంద శాతం రుణమాఫీ జరిగిందంటున్నారు. పావలా శాతం కూడా రుణమాఫీ జరగలేదని రైతులు అంటున్నారు. అసలు రుణమాఫీ ఎంత జరిగిందనేది ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలన్నారు.అలాగే ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ రైతు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.