28 నుంచి రైతుబంధు

పదో విడత రైతుబంధులో భాగంగా 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో రూ.7600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

Advertisement
Update:2022-12-18 19:45 IST

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగికి ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. నిధులను రైతుల ఖాతాల్లో జమచేసేలా చూడాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆదివారం ఆదేశించారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడిని అందించనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు గాను పదో విడత రైతుబంధులో 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాల్లో రూ.7600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పది వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తుంది.

సాగునీరు, 24 గంటల విద్యుత్తుతో పాటు రైతు బీమా అందజేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా..దేశ వ్యవసాయ రంగ నమూనా మార్పునకు దారితీసింది. కేసీఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించింది. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా రాజీ పడకుండా రైతులకు రైతు బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంద‌ని తెలిపింది. ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News