హోం మంత్రి లేరు, విద్యా శాఖ మంత్రి లేరు.. ఏం ప్రభుత్వం ఇది..?
హోం మంత్రి లేకుండా కాలం నెట్టుకొస్తున్నారని, మంత్రి పదవులను కేటాయించడంలో అంత అలసత్వమెందుకని సూటిగా ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్.
దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంటే అది తెలంగాణేనని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణకు ఈ దుస్థితి పట్టిందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్నారని, రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్.
కొల్లాపూర్‌లోని మూల్చింతలపల్లి గ్రామంలో గిరిజన మహిళను కిడ్నాప్ చేసి వారం రోజులపాటు అత్యాచారం చేశారని, తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుందని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. కనీసం పోలీసులకు సమాచారం లేదని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని అన్నారు. హోం మంత్రి లేకుండా కాలం నెట్టుకొస్తున్నారని, మంత్రి పదవులను కేటాయించడంలో అంత అలసత్వమెందుకని సూటిగా ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్.
విద్యా వ్యవస్థ పనితీరు కూడా దారుణంగా ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యాశాఖ మంత్రి కూడా తెలంగాణకు లేకపోవడం శోచనీయం అన్నారు. అటు పోచారం కాంగ్రెస్ ఎంట్రీపై కూడా ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గద్దలా తన్నుకుపోతోందని, గతంలో చెప్పిన నీతుల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు పాటించడంలేదని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.