బండిసంజయ్ పై తిరుగుబాటు...నిన్న అరవింద్, ఈరోజుమరో సీనియర్ నేత‌!

పలువురు బీజేపీ నాయకులు బండి సంజయ్ పై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. నిన్న ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ మీద విరుచుక పడగా, ఈ రోజు ఎల్ బీ నగర్ నుంచి బీజేపీ తరపున‌ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు పేరాల శేఖర్ రావు వంతు వచ్చింది.

Advertisement
Update:2023-03-13 13:18 IST

తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య రచ్చ రగులుతోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలిపై ఇప్పటికే సీనియర్ నాయకులు అధిష్టానానికి పిర్యాదులు చేసినట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లు బండికి వ్యతిరేక‍గా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. సంజయ్, ఈటల మధ్య‌ విబేధాలు కొన్ని సార్లు బహిరంగమయ్యాయి కూడా. ఒకరు మాట్లాడిన మాటలను మరొకరు బహిరంగంగానే ఖండించిన సందర్భాలున్నాయి.

ఇక ఇప్పుడు మరి కొందరు నాయకులు బండి సంజయ్ పై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. నిన్న ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ బండి సంజయ్ మీద విరుచుక పడగా ఈ రోజు ఎల్ బీ నగర్ నుంచి బీజేపీ తరపున‌ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు పేరాల శేఖర్ రావు వంతు వచ్చింది.

బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అరవింద్, అధ్యక్షుడంటే పవర్ సెంటర్ కాదని సమన్వయకర్త అని సంజయ్ మీద విమర్శలు గుప్పించారు. కవిత మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, తన కేలేజీ రోజుల నుండే ఆరెస్సెస్, ఏబీవీపీలో పని చేసి దాదాపు 20 ఏళ్ళు ఏబీవీపీ కి పూర్తి సమయం కార్యకర్తగా ఉండి అనేక రాష్ట్రాల్లో ఏబీవీపీకి నాయకత్వం వహించిన పేరాల శేఖర్ రావు గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఎల్ బీ నగర్ నుండి పోటీ చేశారు. ఆయన కొంత కాలంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ శేఖర్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అనేక ఏళ్ళుగా పార్టీకి సేవ చేస్తున్న మేదావులను వదిలేసి డబ్బు సంచులు తెచ్చే కార్పోరేట్ వ్యాపారవేత్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడమేంటని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

ఇప్పుడు మళ్ళీ కల్వకుంట్ల కవిత విషయంలో సంజయ్ తీరుపై విరుచుక పడ్డారు. ధర్మపురి అరవింద్ మాట్లాడింది వంద శాతం సరైనదే అని అన్నారాయన.బండి సంజయ్ కి పరిణితి లేదని, నియంత అని ధ్వజమెత్తారు. ఆయనవన్నీ బ్లాక్ మెయిల్, సెటిల్ మెంట్ వ్వవహారాలే అని ఆరోపించారు. అన్ని విషయాలను తాను నిరూపించడానికి సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.ఫేస్ బుక్ లో పేరాల శేఖర్ రావు పెట్టిన పోస్ట్....

''మిత్రులు, అభిమానులకు నమస్కారం...ధర్మపురి మాట్లాడింది 100% Correct..కిషన్ రెడ్డి గారో,లక్ష్మణ్ గారో,ఇతర పెద్దలు చేయాల్సిన పని ఆయన చేశారు..అధ్యక్షుని పరిణతి లేని అసందర్భ మాటలు,వ్యవహారం,నియంతృత్వం,అప్రజాస్వామిక చేష్టలు bjp లో ఈ పరిస్థితికి కారణం..అన్ని మసీదుల తవ్వకాలు,ముద్దులు పెట్టడాలు,బ్లాక్మెయిల్,Issues లేవదీసి అంతర్గతంగా settlement లు,సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం,ఒంటెద్దు పోకడలు,సమన్వయ లోపం,వ్యక్తిగత ఆర్థిక స్వార్థం,Use and Throw లు-మన పార్టీ సంస్కృతి కాదు,అయినా యధేచ్చగా నడుస్తున్నాయి..వీటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం..పార్టీలో వినే సంస్కృతి-చర్చించే పద్ధతి మాయమైనప్పుడు Social Media ఆధారమవుతున్నది..ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కు లాగా ఉంది.దీనికి కారణం రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధాలే..KCR-TRS పతనం అవుతున్న సమయంలో,ఇది మన దురదృష్టం.. కేంద్ర పార్టీ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నా ఉపయోగించుకోలేక పోతున్నాము.'' అని శేఖర్ కామెంట్ చేశారు.

ఇవి ఒక ధర్మపురి అరవింద్, పేరాల శెఖర్ ల మాటలే కాదు. ఆ పార్టీలో బైటికి అనలేక లోలోపల కుమిలిపోతున్నవారు అనేక మంది ఉన్నారని బీజేపీ వర్గాలే వాపోతున్నాయి. బండి సంజయ్ వ్యవహార శైలి, మాట తీరు పార్టీని నాశ‌నం చేస్తున్నదని, నిజాయితీ గా ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పని చేసిన వారు ఆయన వల్ల దూరమవుతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. ఆయన మాట తీరువల్ల అనేక మంది సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడటమే మానేశారని అంటున్నారు.

ఈ సారి తెలంగాణలో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే బండి సంజయ్ మూలంగా... గెలుపు పక్కన పెడితే అసలు ఎన్నినియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కించుకుంటామో అర్దం కావడంలేదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News