మోదీ సభ: వృథా ఖర్చు, సెల్ఫ్ డబ్బా
తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వివేక్ వెంకట స్వామి, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సభకు గైర్హాజరవడం వారికి ఉన్న విజ్ఞతకు నిదర్శనం అన్నారు.
పాలమూరులో ప్రధాని మోదీ సభ వృథా ఖర్చు, సెల్ఫ్ డబ్బా అని ఎద్దేవా చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. గిరిజన యూనివర్శిటీ, పసుపు బోర్డు ఇస్తామంటూ కొత్తగా హామీలివ్వడమేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మోదీ, వట్టి మాటలతో కనికట్టు చేశారని అన్నారు.
పాలమూరు - రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తారేమోనని ఆశించామని కానీ మోదీ ఆ మాటే ఎత్తలేదన్నారు రేవంత్ రెడ్డి. గుజరాత్ కి ప్రాజెక్ట్ లు ఇస్తున్నట్టుగా, పాలమూరుకి ఇండస్ట్రియల్ పార్క్ ప్రకటిస్తారని, నిరుద్యోగ సమస్యకు కొంతవరకయినా పరిష్కారం చూపెడతారని అనుకున్నామని కానీ అదికూడా జరగలేదన్నారు. కనీసం మోదీ సభకోసం పెట్టిన ఖర్చయినా పాలమూరుకి ఇస్తే సంతోషించేవారమన్నారు రేవంత్ రెడ్డి. మోదీ ఫ్లైట్ ఖర్చులు, సభ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చంతా వృథాయేనన్నారు.
తల్లిని చంపి బిడ్డను బతికించారని, తెలంగాణ ఏర్పాటు సమయంలో పార్లమెంట్ లో నిబంధనలు ఉల్లంఘించారని అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీని తెలంగాణకు తీసుకొచ్చి సభ పెట్టించడం స్థానిక బీజేపీ నేతలకు సరికాదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకట స్వామి, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సభకు గైర్హాజరవడం వారికి ఉన్న విజ్ఞతకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ఏర్పాటునే వెటకారం చేసిన మోదీకి మిగతా నాయకులు స్వాగతం పలకడం అనైతికం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.