'మూసీ' పేరుతో రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

మూసీకి ఆయన ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుతున్నారన్న మాజీ మంత్రి హరీశ్‌

Advertisement
Update:2024-10-18 13:04 IST

అబద్ధమే ఆశ్చర్యపడేలా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం ఎలాంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూసీకి ఆయన ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుతున్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ సవాల్‌ విసిరారు. రేపు ఉదయం 9 గంటలకు సీఎం ఇంటికి వెళ్లడానికి సిద్ధమన్నారు. బిజీ షెడ్యూల్‌ ఉంటే చర్చకు ఎప్పుడు సిద్ధమో తేదీ, సమయం చెప్పాలన్నారు. మూసీ బాధితుల వద్దకు వెళ్దామని.. వాళ్లతో మాట్లాడుదామన్నారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయక సాగర్‌ కాలనీలకు వెళ్దాం. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు ఏం చేశామో వచ్చి చూడాలని కోరుతున్నాను. మల్లన్న సాగర్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టాం. వచ్చి చూడండి. ఆర్‌అండ్‌ ఆర్‌ కింద 250 గజాల్లో దేశంలోనే గొప్పగా ఇళ్లు కట్టాం. 2013 భూసేకరణ చట్టానికి మించిన ప్రయోజనాలు కల్పించామన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగానే మేము 31 ఎస్టీపీలు నిర్మించామని చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌ ఏఐ టెక్నాలజీ చూపెట్టారు. నీటితో కళకళలాడేలా నదిని బాగు చేయడమే పునరుజ్జీవం. రివర్‌ ఫ్రంట్‌ అంటే ఏమిటి? దాని స్టంట్‌ ఏంటో సీఎం చెప్పాలి. నదిని శుభ్రం చేయడం నుంచే పనులు ప్రారంభం కావాలి. మూసీ నదిలో పారిశ్రామిక వ్యర్థాలు కలువకుండా చర్యలు చేపట్టాలని, మురికి నీరు రాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అసలు పని వదిలిపెట్టి ఇళ్లు కూలగొట్టడంపై సీఎం దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాలు చూసి పేదల ఇళ్లపై దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ పేరుతో, ఫార్మాసిటీకి మేం సేకరించిన భూమితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని మూసీ బాధితులకు ఎందుకు అమలు చేయరని? ప్రశ్నించారు. రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామన్నది రేవంతే అన్నారు. ఏం చేయాలన్నా డీపీఆర్‌ సిద్ధం చేయాలి. పర్యావరణ అనుమతి కావాలి. మూసీ నది సుందరీకరణ పేరుతో అనేకసార్లు మాటలు మార్చిన ఘనత సీఎందేనని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News