రేపు ఢిల్లీకి రేవంత్.. షర్మిల కోసమేనా..?
రేపటి రేవంత్ టూర్‌లో రాజకీయంగా పెద్ద ట్విస్టే ఉందన్న చర్చ జరుగుతోంది. YSRTP అధ్యక్షురాలు షర్మిలే ఇందుకు కారణం. షర్మిల కూడా రేపు ఢిల్లీ వెళ్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. మరోసారి రేవంత్ ఢిల్లీ వెళ్లడంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. రేపు ఢిల్లీ వేదికగా ఏఐసీసీ సమావేశం జరగనుంది. మీటింగ్‌లో పార్టీ అధ్యక్షులు ఖర్గేతోపాటు సోనియా, రాహుల్ గాంధీలు కూడా పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనుంది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఎంపీ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆ దిశగా శ్రేణులను, నేతలను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశం పెట్టారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈలోపు లోటుపాట్లను సరిచేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీల విషయాన్ని రేవంత్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులపై పార్టీ పెద్దల నుంచి క్లారిటీ తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా రేపటి రేవంత్ టూర్‌లో రాజకీయంగా పెద్ద ట్విస్టే ఉందన్న చర్చ జరుగుతోంది. YSRTP అధ్యక్షురాలు షర్మిలే ఇందుకు కారణం. షర్మిల కూడా రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఆమె పార్టీ పెద్దల సమక్షంలో YSRTPని హస్తంపార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది.