రేవంత్.. మీ చిల్లర వ్యూహాలతో భయపెట్టలేరు
కేటీఆర్ పై కేసు నమోదు చేయడంపై ఎమ్మెల్సీ కవిత
చిల్లర వ్యూహాలతో తమను భయపెట్టలేరని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కవిత స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నించడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదన్నారు. తాము కేసీఆర్ సైనికులమని.. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి వచ్చిన వాళ్లమని గుర్తు పెట్టుకోవాలన్నారు. సీఎం చిల్లర వ్యూహాలు తమను భయపెట్టవని.. అవి తమ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయన్నారు. పోరాటం తమకు కొత్త కాదని, అక్రమ కేసులతో తమ గొంతులను నొక్కలేరని తేల్చిచెప్పారు.