తెలంగాణను రేవంత్‌ తాగుబోతుల రాష్ట్రం చేయాలని చూస్తున్నడు

ప్రజల ప్రాణాలు పోయినా మద్యం ఏరులై పారించాలని కంకణం కట్టుకున్నడు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-11-13 15:19 IST

తెలంగాణను సీఎం రేవంత్‌ రెడ్డి తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారని, ప్రజల ప్రాణాలు పోయినా మద్యాన్ని ఏరులై పారించాలని కంకణం కట్టుకున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ నాయకురాలు పాల్వాయి స్రంవతి తదితరులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. కేంద్రంలో వడ్లు ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ, నల్గొండలో ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకు మూడు లక్షల టన్నులు కూడా కొనలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం దళారుల పాలయ్యిందని, దళారులు క్వింటాల్‌ వడ్లను రూ.1,800లకే కొంటున్నారని, దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. వడ్లకు రూ.500 చొప్పున బోనస్‌, ఏడాదికి రూ.15 వేల రైతుబంధు ఇస్తామని రేవంత్‌ ఎన్నికలకు ముందు బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మాట తప్పారని అన్నారు. కొన్న వడ్లకు డబ్బులు ఇవ్వాలని కొందరు, వడ్లు కొనాలని ఇంకొందరు రైతులు ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో ఇంతవరకు కిలో సన్నవడ్లు కొనలేదని అన్నారు.

రైతుల వడ్లు కొనకుంటే అధికారులను ప్రశ్నించని సీఎం.. మద్యం తక్కువ అమ్మారని ఎక్సైజ్‌ అధికారులకు మెమోలు ఇస్తున్నారని మండిపడ్డారు. టార్గెట్లు పెట్టి ప్రజలతో మద్యం తాగించడం ఏమిటని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన రేవంత్‌ విచ్చలవిడి మద్యం అమ్మకాలతో వాళ్ల పుస్తెలు తెంపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రజల గురించి కాకుండా పైసల గురించే ఆలోచిస్తున్నాడని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిందా, రుణమాఫీ జరిగిందా, సమయానికి బోనస్‌ ఇచ్చామా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామా లేదా అన్న సోయి సీఎంకు లేదన్నారు. రాష్ట్రంలో పండిన పంటలో 90 లక్షల టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, పరిస్థితి చూస్తుంటే 40 లక్షల టన్నలు కూడా కొనేలా లేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తక్కువ ధరకు తెలంగాణలో వడ్లు కొంటున్నారని, ఇంత దుర్భర పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. తన పరిపాలనలో రేవంత్‌ రెడ్డి రైతులను ఏడిపిస్తున్నాడని మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్టుగా రైతులకు రూ.15 వేల రైతుభరోసా సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News