రేవంత్ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే
రిజర్వేషన్లపై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు
కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు అన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం నాంపల్లి స్పెషల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రేవంత్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ ను విచారించారు. ఈ కేసు విచారణ వాయిదా పడిన తర్వాత కోర్టు ఆవరణలో వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచార సభలో పాల్గొని బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తొలగిస్తారని ఆరోపణలు చేశారని తాను పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. బీజేపీతో పాటు ప్రధాని నరేంద్రమోదీని అప్రతిష్ట పాలు చేయడానికే రేవంత్ రెడ్డి ఇలాంటి అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 25న) రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరుకావాలని గత నెలలోనే మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వచ్చే వాయిదాకు రేవంత్ రెడ్డి కోర్టు హాజరు కావాల్సిందేనని తెలిపారు. అసత్య ఆరోపణలకు రేవంత్ వివరణ ఇచ్చే వరకు బీజేపీ వదిలిపెట్టబోదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలు కోసం తాము పోరాటం చేస్తామన్నారు. ప్రజాకోర్టులో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి తీరుతామన్నారు.