లగచర్లలో భూసేకరణ నుంచి రేవంత్‌ వెనక్కి తగ్గాలి

అల్లుడు, అదానీ కోసం అమాయక గిరిజన రైతులను బలిపెట్టొద్దు : కేటీఆర్‌

Advertisement
Update:2024-11-27 16:43 IST

దిలావర్‌పూర్‌ లో రైతుల దెబ్బకు దిగొచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి లగచర్ల విషయంలో లెంపలేసుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా డిమాండ్‌ చేశారు. అల్లుడి కోసం, అదానీ కోసం లగచర్లలో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ముసుగులో పెడుతోన్న ఫార్మా, సిమెంట్‌ ఫ్యాక్టరీల ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలని, అక్కడ శాంతిని నెలకొల్పాలని కోరారు. రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ల ముందు ఉందని, అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్‌లో ఇథనాల్ మంటలు రాజేశారని తెలిపారు. తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో ఉందన్నారు. ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం.. వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి అన్న విషయాన్ని గుర్తెరిగి నిర్మల్ తరహాలోనే లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు.. లేకపోతే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News