కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలవుతది
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు. 37 రోజుల పాటు జైలులో ఉండి గురువారం బెయిల్ పై విడుదలైన ఆయన తెలంగాణ భవన్ లో కేటీఆర్, ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎన్ని అమలయ్యాయో కొడంగల్ నియోజకవర్గంలోని ఒక ఊరిలో గ్రామ సభ పెట్టి నిరూపించాలన్నారు. ఆ ఊరిలో సగం మందికి పథకాలు అందాయని చెప్తే అప్పుడు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవాలని, ఆ ఉత్సవంలో తాను పాల్గొంటానని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అధికారులపై దాడి చేయించి తమపై తప్పుడు కేసులు పెట్టించారని తెలిపారు. ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా అమాయక రైతులతో పాటు అరెస్ట్ చేయించారని చెప్పారు.
ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పెంపారన్నారు. ఆ సంఘటనలో తన ప్రయమేమి లేదని సంఘటన జరిగిన రోజు తాను తెలంగాణ భవన్ లో ప్రెస్‌మీట్‌లో ఉన్నానని గుర్తు చేశారు. రిమాండ్ రిపోర్టులో ఏముందో కూడా చదువుకునే అవకాశం ఇవ్వకుండా నన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తననే తప్పుడు కేసులో ఇరికించారని.. తన ద్వారా కేటీఆర్ ను కుట్రపూరితంగా ఇరికించాలని చూశారని చెప్పారు. నాకు బెయిల్ వచ్చిన రోజే కేటీఆర్ పై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, చెయ్యని తప్పుకు ఈ మూర్ఖపు, నిరంకుశ ప్రభుత్వం వల్ల పట్నం నరేందర్ రెడ్డితో పాటు 28 మంది రైతులను 37 రోజులు జైళ్లో పెట్టిందన్నారు. చరిత్రలో లగచర్ల పేరు ఎన్నటికీ మరిచిపోరు.. వీరి పోరాటం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ఇది కొడంగల్ రైతుల విజయమన్నారు.