రేవంత్ రెడ్డి బెదిరింపులు మామూలుగా లేవుగా..!

ఇంకో 45 రోజుల్లో తమ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని.. ఆ పోలీస్ అధికారుల సంగతి తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ డీజీపీ.. ఆంధ్రాకు కేటాయించిన వ్యక్తి అని, ఆయన్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update:2023-10-12 19:54 IST

అధికారంలోకి వస్తే ఆ పథకం తెస్తాం, ఈ మేలు చేస్తాం అనే నాయకులను చూస్తూ ఉంటాం. కానీ మేం అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తామంటున్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మిత్తితో సహా చెల్లిస్తామంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి గాంధీ భవన్ నుంచి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈరోజు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.. పనిలో పనిగా అధికార బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టే కొంతమంది అధికారులు ఆటలాడుతున్నారని, వారి సంగతి తేలుస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అకారణంగా కేసులు పెట్టారని, ఇంకో 45 రోజుల్లో తమ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని.. ఆ పోలీస్ అధికారుల సంగతి తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ డీజీపీ.. ఆంధ్రాకు కేటాయించిన వ్యక్తి అని, ఆయన్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. స్టీఫెన్ రవీంద్ర.. కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వీరందర్నీ నియంత్రించాలని కోరారు.

ఇటీవల మెట్రో రైలు అధికారులకు కూడా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమ హోర్డింగ్ లకు చోటివ్వడంలేదని, కేవలం బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రచారానికి ఉద్దేశపూర్వకంగానే మెట్రో యాజమాన్యం సహాయ నిరాకరణ చేస్తోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కి ఎన్నికల నిధులు సమకూర్చేందుకు పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చేస్తామన్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News