తలసాని వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్..
ఎన్నికల ఏడాది కావడంతో నాయకులు ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. అయితే విమర్శలు కాస్తా వ్యక్తిగతంగా మారడంతో సోషల్ మీడియాలో వారి మాటలు వైరల్ అవుతున్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. "పిసికితే ప్రాణం పోతది" అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ తలసాని మండిపడ్డారు. అయితే ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ ని కూడా రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారని, అందుకే తాను కుడా వారి భాషలోనే సమాధానం చెప్పాల్సి వచ్చిందన్నారు. నాయకులెవరైనా తప్పుగా మాట్లాడకూడదని ఒప్పుకున్నారు. అయితే ఈ గొడవ ఇక్కడితో సమసిపోలేదు. రేవంత్ రెడ్డి కూడా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
ఆయనకు పేడ పిసకడం బాగా తెలుసని, అందుకే ఏదో పిసుకుతానంటున్నారని, టైమ్ డేట్ చెబితే తానే అక్కడికి వస్తానంటూ బదులిచ్చారు రేవంత్ రెడ్డి. తాను ఓ ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినని ఆ విషయం తలసాని తెలుసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. అంతే కాదు, తలసానిపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. ఆయన అలవాట్లను కూడా ఎత్తి చూపారు.
మొత్తమ్మీద కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు కాస్త భారీగానే పేలుతున్నాయి. మంత్రి తలసాని వ్యాఖ్యలకు అంతే ధీటుగా బదులిచ్చారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఏడాది కావడంతో నాయకులు ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. అయితే విమర్శలు కాస్తా వ్యక్తిగతంగా మారడంతో సోషల్ మీడియాలో వారి మాటలు వైరల్ అవుతున్నాయి.