'పిచ్చోడి చేతిలో రాయిలా' రాష్ట్రంలో పరిస్థితి

ఆయనకు విజన్‌ లేదు.. విజ్డమ్‌ లేదు.. : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-12-20 19:24 IST

దాసరి నారాయణరావు తీసిన 'పిచ్చోడి చేతిలో రాయి' సినిమా మాదిరిగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ కు విజన్‌ లేదు.. విజ్డమ్‌ లేదని, ఆయనవిజన్‌ లెస్‌ చీఫ్‌ మినిస్టర్‌ అన్నారు. శుక్రవారం వచ్చిందంటేనే ప్రజలు భయపడుతున్నారని.. ఎవరి ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చి కూలగొడుతారోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను, హైదరాబాద్‌ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే రేవంత్‌ రెడ్డి ఏడాదిలో విధ్వంసం సృష్టించారని అన్నారు. కేటీఆర్‌ పై ఫార్ములా - ఈ రేసులో పెట్టిన కేసు డొల్ల అని మొదటి అడుగులోనే తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ రేసు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని, తాము సభలో లేనప్పుడు సీఎం మాట్లాడారని, తాము ఎన్నిసార్లు కోరినా చర్చకు అనుమతించలేదున్నారు. తాము కేసు పెట్టొద్దని ఎక్కడా చెప్పలేదని అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో కేసు పెట్టారు కాబట్టి చర్చ పెట్టాలని మాత్రమే డిమాండ్‌ చేశామన్నారు.




 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఇష్టం వచ్చినట్టుగా రేవంత్‌ రెడ్డి రద్దు చేస్తున్నారని అన్నారు. రేవంత్‌ తప్పులను అసెంబ్లీలో కేటీఆర్‌ నిలదీయకుండా ఉండేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి చర్యలతో రాష్ట్ర పరపతి, ఇమేజ్‌ దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రేవంత్‌ చర్యలతో తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. వస్తేగిస్తే రేవంత్‌ బినామీలో.. ఆయన దోస్తు అదానీ తప్ప ఇంకెవరూ పెట్టుబడికి ముందుకు రారన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం అవినీతిని ఎప్పటికప్పుడు కేటీఆర్‌ బయట పెడుతున్నారని, అందుకే ఆయనకు కంటగింపుగా మారారన్నారు. రేవంత్‌రెడ్డి చర్యల వల్ల రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందన్నారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని, అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసు వివరాలు కావాలని ఈడీ అడిగినట్టుగా వార్తల్లో చూశానని అన్నారు. నిన్న నమోదు అయిన కేసులో వెంటనే ఈడీ జోక్యం వెనుక మతలబు ఏమిటి.. కాంగ్రెస్‌, భాజపా దోస్తానాతోనే ఈ వివరాలు అడుగుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చోటే బాయ్ కేసు పెడితే బడా బాయ్ ఎంటర్‌ అవుతున్నాడని, వారిద్దరి బంధం భయట పడిందన్నారు. కుట్రలు చేసి కేటీఆర్‌ను జైలులో పెట్టడమే రేవంత్‌రెడ్డి లక్ష్యమన్నారు. అసెంబ్లీలో చర్చ పెడితే కేసులో డొల్లతనం బయటపడుతుందన్నారు.

ఫార్ములా-ఈ రేస్‌కు మూడో విడత కింద 50 శాతం నిధులు అంటే 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడంతోనే అగ్రిమెంట్‌ రద్దు చేసుకుంటున్నామని ఏవీవీ కంపెనీ డిసెంబరు 22న దాన కిశోర్‌కు లేఖ రాసిందన్నారు. ఇంకా 50శాతం నిధులు అంటే రూ.45 కోట్లు మాత్రమేనని తెలిపారు. నిధుల చెల్లింపు ఏమాత్రం ఇల్లీగల్‌ కాదన్నారు. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, గవర్నమెంట్‌ అంటే మంత్రి అనేది రేవంత్‌ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఫార్ములా - ఈ రేస్‌ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీపడ్డాయని, ఈ రేసింగ్‌ కోసం మొదటి దఫాలో రూ.30కోట్లు ఖర్చు పెడితే జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.71 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మూడో విడతలో రూ.45 కోట్లు చెల్లిస్తే..రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం వచ్చేదని గుర్తు చేశరాఉ. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. కొన్ని రోజుల క్రితమే తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా-4 నిర్వహించిందని, అందుకోసం ఖజానా నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్రో-ఏసియన్‌ గేమ్స్‌ నిర్వహించింది. ఉన్న ఫార్ములా -ఈ రేస్‌నే రద్దు చేసిన రేవంత్‌ రెడ్డి ఒలింపిక్స్‌ నిర్వహిస్తామనడం పెద్ద జోక్‌ అన్నారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కేసులు పెట్టని వాళ్లే లేరన్నారు. రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, సినిమా వాళ్లు, పోలీసులతోనే పోలీసుల కుటుంబ సభ్యులపై కేసులు పెట్టించారని అన్నారు. కేటీఆర్ మీద, తనపైన, తలసాని, పల్లా, కౌశిక్ రెడ్డిలపై కేసులు పెట్టించాడని, పట్నం నరేంద్ రెడ్డి నిన్ననే జైలు నుంచి బయటికి వచ్చాడని అన్నారు. రాహుల్‌ గాంధీ ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ అంటూ.. గల్లీలో రాజ్యాంగ భక్షణ చేస్తున్నాడని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికే తాళం పెట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది అన్నారు. ''ఎండాకాలం వడ దెబ్బ తప్పించుకోవచ్చు గానీ, రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బ తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది.. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మా కేటీఆర్నీ వెంటపడటం మానరు, నీ బండారం బయటపెట్టడం ఆపరు. ఈ పిచ్చి కేసులకు భయపడి మా లీడర్లు గానీ, క్యాడర్లు గానీ ఎక్కడా తగ్గరు. సగం మంది రుణమాఫీ ఎగ్గొట్టినోడికి, రైతుబంధు ఎగ్గొట్టినోడికి, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టినోడికి, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టినోడికి, పింఛన్ల పెంపుదల ఎగ్గొట్టినోడికి, మహిళలకు 2500 ఎగ్గొట్టినోడికి, ఆడబిడ్డలకు తులం బంగారం ఎగ్గొట్టినోడికి, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినోడికి.. మొత్తంగా అభయహస్తం మేనిఫెస్టోనే ఎగ్గొట్టినోడికి కేసులు పెట్టుడు తప్పం ఇంకే చాతనైతది. ఇప్పటికైనా పిచ్చి ప్రయత్నాలు మానుకో. రాష్ట్రం కోసం పని చెయ్యి..'' అన్నారు. సమావేశంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, నాయకుడు రాకేశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News