రేవంత్ రెడ్డి ఎవరికి రాజీనామా ఇచ్చారు : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి కూడా పోటీ చేయనని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-06-24 07:21 IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా.. తన ఇష్టానుసారం రాజకీయాలకు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. ఆయన మాటలకు చేతలకు పొంతనే ఉండదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చారు. కానీ, రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత తన రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చారు. అది కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి ఇచ్చిన విషయాన్ని సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని.. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. మూడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చెరిపేయలేదని గుత్తా చెప్పారు. కేంద్రంలోని బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్స్, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్‌ను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయను..

రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి కూడా పోటీ చేయనని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తన కుమారుడు అమిత్ రెడ్డికి అవకాశం లభిస్తే పోటీ చేస్తాడని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ బాగా పని చేస్తున్నారని.. ఈ సారి జిల్లాలోని 12 సీట్లు బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లోకి వస్తారనే విషయం తనకు మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే నిజం కాదని చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News