నా చేతుల్లో ఏమీ లేదు.. రేటెంత వ్యాఖ్యలపై రేవంత్ పరోక్ష స్పందన

కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో ఇంకెవరిపై కూడా ఈ స్థాయిలో విమర్శలు వినపడటంలేదు, పార్టీ నేతలయినా, బయటవారయినా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-10-13 08:43 IST

తెలంగాణ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ జాబితా కామెడీగా మారిపోయింది. పార్టీలో సీనియర్లకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలియదు కానీ.. కొత్తగా వ్చచిన ప్యారాచూట్ నేతలకు మాత్రం టికెట్లు ఖరారయ్యాయి. మైనంపల్లి లాంటి వారు ఏకంగా రెండు సీట్లు ఖాయం చేసుకుని ప్రచార పర్వంలో దిగిపోయారు. ఆదిలాబాద్ లాంటి చోట్ల కుక్కర్ల పంపిణీ కూడా మొదలైంది. ఈ దశలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆయన టికెట్లకు రేటు కట్టి అమ్మేస్తున్నారని.. ఆయన పేరు రేటెంత రెడ్డిగా మారిపోయిందని సెటైర్లు పేలుతున్నాయి. ఈ విమర్శలపై పరోక్షంగా స్పందించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపు, జాబితా విడుదల అనేది తన చేతుల్లో లేదని స్పష్టం చేశారు.

గాంధీ భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పరోక్షంగా తనపై వస్తున్న విమర్శలకు బదులిచ్చారు. ఈరోజు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తాను వెళ్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మురళీధరన్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఉందని.. ఆ కమిటీ ఆధ్వర్యంలో పని జరుగుతోందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల దగ్గర్నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరి అభిప్రాయాలు ఆ కమిటీ తీసుకుందన్నారు. స్క్రీనింగ్‌ కమిటీ నివేదికతో పాటు సర్వే నివేదికల ఆధారంగా కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

నోటుకి సీటు ఆఫర్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. క్యాష్ తోపాటు పొలాలు కూడా తన పేరుపై రాయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. అమెరికాలో డీల్స్ అన్నీ పూర్తయ్యాయని, ఇక్కడికొచ్చాక సర్వేల పేరుతో తనకిష్టమైన వారికి ప్రజాదరణ ఉన్నట్టుగా రేవంత్ అధిష్టానం ముందు బిల్డప్ ఇస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో ఇంకెవరిపై కూడా ఈ స్థాయిలో విమర్శలు వినపడటంలేదు, పార్టీ నేతలయినా, బయటవారయినా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయన పరోక్షంగా విమర్శలపై స్పందించారు. తన చేతుల్లో ఏమీ లేదని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News