ఈ నెల 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర
ఈ నెల 26న 'హాత్ సే హాత్ జోడో' యాత్ర ప్రారంభిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. భద్రాచలం నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్ జోడో' పేరుతో నిర్వహించతలపెట్టిన పాద యాత్ర ఎట్టకేలకు ప్రారంభం కాబోతుంది. రేవంత్ పాద యాత్రను సీనియర్లు పలువురు వ్యతిరేకిస్తుండటంతో అసలా యాత్ర జరుగుతుందాలేదా అనే అనే అనుమానం ఇప్పటి వరకు ఆ పార్టీ కార్యకర్తలను తొలిచివేసింది. అయితే ఈ రోజు జరిగిన పీసీసీ విస్త్రుత స్థాయి సమావేశంలో రేవంత్ పాదయాత్రకు ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సమావేశం తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 26న హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. భద్రాచలం నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని ఆయన తెలిపారు.
కాగా 50 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి, మరో 30, 40 నియోజకవర్గాల్లో ఇతర సీనియర్ నాయకులు పాద యాత్రలు నిర్వహించాలని ఠాక్రే సూచించినట్టు సమాచారం. అందరూ కలిసి చేయవచ్చు లేదా ఎవరికి వారు తమకు అనుకూలమైన నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయవచ్చు అని ఠాక్రే నాయకులకు చెప్పినట్టు సమాచారం.