బ్రేక్ ఫాస్ట్ పథకానికి మంచి స్పందన.. రేవంత్ రెడ్డి ఏం చేశారంటే..?
ఉచిత అల్పాహార పథకం మంచిదే కానీ.. అంటూ రేవంత్ తన లేఖను మొదలు పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో లోపాలున్నాయని ఆరోపించారు.
స్కూల్ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడంతోపాటు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని సవరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందంటున్నారు. ఉదయాన్నే పిల్లల టిఫిన్ కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇది అనుకోని వరంలా మారింది. అర్ధాకలితో స్కూల్ కి వచ్చే పేద కడుపులు నింపుతున్న పథకం ఇది. ఈ పథకంతో కాంగ్రెస్ డైలమాలో పడింది. ఆరు గ్యారెంటీలంటూ ఆ పార్టీ గొంతు చించుకుంటున్నా జనం నమ్మట్లేదు. బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న నూతన పథకాలకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ కి ఓ లేఖాస్త్రాన్ని సంధించారు.
ఉచిత అల్పాహార పథకం మంచిదే కానీ.. అంటూ రేవంత్ తన లేఖను మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో లోపాలున్నాయని ఆయన ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచలేదని, మధ్యాహ్న భోజనం మెనూ మార్చడంతో వంట కార్మికులపై ఆర్థిక భారం పడిందని చెప్పుకొచ్చారు. వంట గదులు శుభ్రంగా లేవని కూడా ఆరోపించారు. పసి పిల్లలతో రాజకీయాలేంటని తన లేఖలో మండిపడ్డారు రేవంత్.
సడన్ గా మధ్యాహ్న భోజన పథకంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు సంధించడం విశేషం. మధ్యాహ్న భోజన కష్టాలపై వెంటనే సీఎం సమీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు రేవంత్. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అయితే ఇన్నాళ్లూ ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ పథకానికి వచ్చిన ఆదరణ చూసి, సడన్ గా ప్రభుత్వంపై బురదజల్లడమేంటని బీఆర్ఎస్ నేతలు రేవంత్ కి కౌంటర్లిస్తున్నారు.
♦