గుంటనక్కలకు ఆశాభంగం.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని, కాంగ్రెస్‌ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update: 2024-06-27 13:00 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా వ్యవహారం టీకప్పులో తుఫానులా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎపిసోడ్ పై, టోటల్ గా ఫిరాయింపు రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. జీవన్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ లో కాంగ్రెస్ కి నష్టం జరుగుతుందేమోనని కొన్ని గోతికాడ నక్కలు ఎదురు చూశాయని, వాటికి ఆశాభంగం తప్పలేదని ఎద్దేవా చేశారు. అసలు ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని, గతంలో 61మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆ పార్టీ లాగేసుకుందని.. ఈ విషయంలో వారికి మాట్లాడే అర్హత లేదన్నారు రేవంత్ రెడ్డి.


జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని, కాంగ్రెస్‌ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాలేదని, సీనియర్‌ నేత అయిన జీవన్ రెడ్డి సేవలను పార్టీ వినియోగించుకుంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తయిందని, కొత్తవారిని నియమించాలని తానే అధిష్టానానికి చెప్పానన్నారు రేవంత్ రెడ్డి.

అప్పుడెందుకు ప్రశ్నించలేదు..?

ప్రస్తుతం అన్ని శాఖలకు సమర్థులైన మంత్రులు ఉన్నారని, విద్యాశాఖ తన పరిధిలోనే ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించామన్నారు. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, అయినా విమర్శలు తప్పడం లేదని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారని, చాన్నాళ్ల వరకు మంత్రి వర్గం లేదని.. ఇప్పుడు హోం మంత్రి లేరు, విద్యామంత్రి లేరంటూ విమర్శలు చేస్తున్నారు, అప్పుడేం చేశారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని, ఏపీతో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News