'రెడ్ డైరీ' వివాదం.. రేవంత్ కి షాకిచ్చిన గన్ మెన్లు

ఉద్దేశ పూర్వకంగానే రేవంత్ గన్ మెన్లు విధులకు హాజరు కావట్లేదని తేలింది. అయితే వారు అటు రేవంత్ రెడ్డికి కానీ, ఇటు ఉన్నతాధికారులకు కానీ సమాచారం ఇవ్వకుండా తమ నిరసన తెలియజేశారు.

Advertisement
Update:2023-08-18 02:08 IST

''పోలీస్ సిబ్బంది పేర్లు రెడ్ డైరీలో నమోదు చేస్తున్నా, అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తా'' నంటూ ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల పర్యవసానంగా ఆయనపై ఇప్పటి వరకూ 20 పోలీస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం నేతలు రేవంత్ పై కేసులు పెట్టారు. ఈ వ్యవహారం అటుంచితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గన్ మెన్లు విధులకు రాకుండా డుమ్మా కొట్టారు.

'రెడ్ డైరీ' ప్రభావమేనా..?

రేవంత్ రెడ్డికి 2 ప్లస్ 2 గన్ మెన్ల భద్రత ఉంది. అయితే ఆ గన్ మెన్లు సడన్ గా విధులకు రావడం మానేశారు. బుధవారం రాత్రి నుంచి రేవంత్ గన్ మెన్లు డ్యూటీకి రావడంలేదు. కనీసం రావట్లేదనే సమాచారం కూడా ఇవ్వలేదు. అటు డీజీపీ నుంచి కూడా దీనిపై వివరణ లేదు. రేవంత్ రెడ్డికి తాము భద్రత తగ్గించలేదని స్పష్టం చేశారు డీజీపీ అంజనీ కుమార్. గన్ మెన్లు సడన్ గా ఎందుకు విధులకు హాజరు కాలేదనే విషంపై ఆరా తీస్తామని మాత్రం చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే రేవంత్ గన్ మెన్లు విధులకు హాజరు కావట్లేదని తేలింది. అయితే వారు అటు రేవంత్ రెడ్డికి కానీ, ఇటు ఉన్నతాధికారులకు కానీ సమాచారం ఇవ్వకుండా తమ నిరసన తెలియజేశారు.

రేవంత్ తగ్గుతారా..?

'రెడ్ డైరీ' విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పోలీసులు నొచ్చుకున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, తాము ఎవరికీ మద్దతుగా పనిచేయబోమని పోలీసులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. పోలీసుల పనితీరుని ప్రభావితం చేసేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ఓవైపు పోలీస్ కేసులు, మరోవైపు గన్ మెన్ల సహాయ నిరాకరణ నేపథ్యంలో.. 'రెడ్ డైరీ' వ్యాఖ్యల్ని రేవంత్ వెనక్కి తీసుకుంటారేమో చూడాలి. రేవంత్ తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ కోరినా.. ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే. 

Tags:    
Advertisement

Similar News