మోడీ వేసిన ఎంగిలి మెతుకుల కోసం కాంగ్రెస్ ను మోసం చేశాడు... రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ ఫైర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆర్థిక లాభాల కోసం బీజేపీలో చేరాడని రేవంత్ ఆరోపించారు.

Advertisement
Update:2022-08-02 21:23 IST

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. సోనియా గాంధీ పై గౌరవం ఉందని చెప్తూనే ఆమెను అన్ని రకాలకు ఇబ్బందులకు గురి చేస్తున్న మోదీ, అమిత్ షాలతో చేతులు కలిపాడ‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వంత కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని రేవంత్ ఆరోపించారు.

ఈడీ ఎన్నికల డిపార్ట్ మెంట్ గా మారి సోనియా గాంధీని తన కార్యాలయంలో మానసికంగా హింసల పాలు చేస్తూ ఉంటే రోడ్డెక్కి పోరాడాల్సిన సమయంలో అమిత్ షా దగ్గర కూర్చొని ఆర్థిక లావాదేవీలు నడిపిన వ్యక్తి సోనియా గాంధీపై గౌరవం ఉందని చెప్పడం సిగ్గుచేటని రేవంత్ విమర్షించారు.

రాజగోపాల్ రెడ్డిని నాయకుడిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి పార్టీకి రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని, మునుగోడు ప్రజలను మోసం చేశాడని ఆరోపించిన రేవంత్ మునుగోడు ప్రజలకు తాము అండగా ఉంటామని, తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మధు యాష్కీ తదితర నాయకులందరం ఈ నెల 5వ తేదీన మునుగోడు వెళ్తున్నామని ఉపఎన్నికలకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని, ఆయన నిబద్దత కాంగ్రెస్ కార్యకర్త అని రేవంత్ చెప్పారు. 


మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అప్రమత్తమైన కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికకు సిద్దమవుతోంది. అందులోభాగంగా రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన గంటల్లోనే మునుగోడు ఉప ఎన్నిక కమిటీని ఏర్పాటు చేసింది. మధుయాష్కీ కన్వీనర్ గా స్ట్రాటజీ, ప్రచార కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అందులో సభ్యులుగా దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్కలను నియమించింది. 

Tags:    
Advertisement

Similar News