రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సమంత గురించేనా..?
రేవంత్ రెడ్డి చెప్పిన ఆ బాధిత భార్యాభర్తలు ఎవరు..? ఫోన్ ట్యాపింగ్ వల్ల వారికి కలిగిన నష్టమేంటి..? అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ట్యాపింగ్ కి సహకరించింది ఎవరు..? బాధితులు ఎవరు..? అనేది చర్చనీయాంశం అవుతోంది. అరెస్ట్ లు ఇప్పుడల్లా పూర్తయ్యేలా లేవు. మరోవైపు ట్యాపింగ్ బాధితులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నాగచైతన్య-సమంత జంట పేరు కూడా ట్యాపింగ్ వ్యవహారంలో వినపడుతోంది. ఆ జంట విడాకులకు కూడా కారణం ఫోన్ ట్యాపింగ్ అంటూ తీన్మార్ మల్లన్న బాంబు పేల్చారు. దానికి కారణం ఓ రాజకీయ నాయకుడు అని కూడా అన్నారాయన. సదరు నాయకుడు మెడిసిన్స్ డిస్ట్రిబ్యూటర్ అని హింటిచ్చారు. ఇక చూస్కోండి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విడాకుల సమయంలో నాగచైతన్య-సమంత జంటపై ఎన్ని వార్తలు వచ్చాయో.. అంతకు మించి ఇప్పుడు ఆ జంట పాపులర్ అవుతోంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..
తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాపింగ్‌పై పక్కాగా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారాయన. బాధ్యులు చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. ట్యాపింగ్ చేయవద్దని ఆ రోజే తాము చెప్పినా అధికారులు వినలేదని.. ఈరోజు వారు ఫలితాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం.. ఓట్లేసిన ప్రజలనే భయపెట్టి, పోలీసు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగ్‌లు చేసి ఎవరేం మాట్లాడుకున్నా వినే దుర్మార్గమైన ఆలోచన చేసిందని అన్నారు రేవంత్ రెడ్డి. భార్యాభర్తలు ఫోన్‌లో మాట్లాడుకున్నా.. విన్నారని ఆరోపించారు.
సాక్షాత్తూ తెలంగాణ సీఎం ఫోన్ ట్యాపింగ్ గురించి కీలక విషయాలు బయటపెట్టడం విశేషం. అందులోనూ ప్రత్యేకించి ఆయన భార్యాభర్తలు ఫోన్లలో మాట్లాడుకున్నా చాటుమాటుగా విన్నారంటూ కలకలం రేపారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆ బాధిత భార్యాభర్తలు ఎవరు..? ఫోన్ ట్యాపింగ్ వల్ల వారికి కలిగిన నష్టమేంటి..? అనేది తేలాల్సి ఉంది. ఆ బాధితులు నాగచైతన్య-సమంత అంటూ సోషల్ మీడియా మరోసారి హోరెత్తిపోతోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పిన ఆ జంట ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.