కాకతీయ శిలాతోరణం, చార్మినార్.. రాచరికపు చిహ్నాలు - రేవంత్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు.
తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ తల్లి అంటే తల్లి, సోదరి, అక్క లాంటిదన్నారు. మన కుటుంబ పెద్దలు ఎవరు కూడా వజ్ర వైడూర్యాలు పెట్టుకొని ఉండడం చూడలేదన్నారు. కొంతమంది రాజులు, రాచరికపు పోకడలున్నవారు, గడీలలో ఉన్నపెత్తందారులు కిరీటాలు, భుజకీర్తులు, నడుములకు ఒడ్డాణాలు పెట్టుకున్నరేమో కానీ..రాచరికపు పోకడలతో వజ్ర వైడూర్యాలతో తెలంగాణ తల్లిని ప్రజలపై రుద్దాలనే ప్రయత్నం చేశారన్నారు రేవంత్.
ఇక తెలంగాణ చిహ్నంలోనూ మార్పులు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతమున్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, కాకతీయ శిలాతోరణం ఉన్నాయని.. అవి రాచరికపు పోకడలకు చిహ్నాలని, అవి పాలకుల ఆలోచనలు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. వాటిలో రాచదర్పాలు ఉట్టి పడుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. గులాములు, వెట్టి చాకిరికి అవి ప్రతిరూపాలన్నారు రేవంత్. ఈ రాష్ట్ర ప్రజాస్వామిక రాష్ట్రమని.. రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందన్నారు. అందుకే అధికారిక చిహ్నాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో బీఆర్ఎస్ ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.