బావమరిది ఫార్మా కంపెనీ కోసమే రేవంత్ తాపత్రయం
అందుకే రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నడు
తన బావమరిది సూదిని సృజన్ రెడ్డి ఫార్మా కంపెనీ కోసమే సీఎం రేవంత్ రెడ్డి రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఆరోపించారు. బుధవారం పార్టీ ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి అగ్గిరాజేస్తున్నాయని అన్నారు. సృజన్ రెడ్డికి చెందిన అడికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి అందులో డైరెక్టర్ గా ఉండేవారని తెలిపారు. తర్వాత కొన్నాళ్లకు ఆ షేర్లను సృజన్ పేరు మీదికి మార్చారని తెలిపారు. రేవంత్‌తో పాటు ఎమ్మెల్సీ కవితతో కలిసి సృజన్ అనేక వ్యాపారాలు చేస్తున్నాడని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సృజన్ పలు పనులు అప్పగించారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులోనూ సృజన్ రెడ్డి నిందితుడని తెలిపారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి దానిని కేంద్ర ప్రభుత్వంపైకి, గవర్నర్ పైకి నెట్టేయాలని చూస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం చేతగాకనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి రోజుకో ఉపాయం పన్నుతున్నాడని మండిపడ్డారు.