ఊసరవెల్లి సిగ్గు పడేలా రేవంత్‌ రంగులు మార్చుతున్నడు

బెనిఫిట్‌ షోలు ఉండవని చెప్పిన రెండు వారాల్లోనే యూటర్న్‌ ఎందుకు : హరీశ్‌ రావు

Advertisement
Update:2025-01-10 15:48 IST

ఊసరవెల్లి సిగ్గు పడేలా సీఎం రేవంత్‌ రెడ్డి రంగులు మార్చుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా మండిపడ్డారు. ఒక సినిమా ప్రివిలేజ్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందినప్పుడు ఇక బెనిఫిట్‌, ప్రివిలేజ్‌ షోలకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇక సినిమాల టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని ఆ కాసేపటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం అసెంబ్లీలోనే చెప్పారని.. ఇప్పుడు సీఎం, మంత్రి మాటలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన మాటకే విలువ లేకపోతే ఎట్లా అని నిలదీశారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించి టికెట్లు రేట్లు పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు అనుమతి ఇవ్వడం అంటే శాసన సభను అవమానించడమేనన్నారు. అసెంబ్లీని పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామన్నారు. మాట తప్పం.. మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. గతంలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే మహిళ మృతి చెందారని, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని గుర్తు చేశారు. ఈ పాపం రేవంత్ రెడ్డినిదేనన్నారు. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే యూ టర్న్‌ ఎందుకు.. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News