రేవంత్ నీకు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రా
జడ్జి ముందు మీడియా సమక్షంలో విచారణకు సిద్ధమా : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. గురువారం ఫార్ములా -ఈ రేస్ కేసులో ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతూ రూ.50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిండు.. అందుకే ఆయనపై ఏసీబీ, ఈడీ కేసులు అయినయ్.. ఇప్పుడు నాపై ఏసీబీ, ఈడీ కేసులు పెట్టిండు.. రేవంత్ కు నేను చాలెంజ్ చేస్తున్న.. ఆయనపై, నాపై నమోదైన ఏసీబీ, ఈడీ కేసులపై లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో విచారణకు సిద్ధమా? ఇంకెక్కడైనా.. ప్లేస్, టైం నీ ఇష్టం.. సిట్టింగ్ జడ్జీనా, రిటైర్డ్ జడ్జీ ముందు విచారణ చేయిస్తావా అన్నది నీ ఇష్టం.. జడ్జి ముందు కూర్చుందాం.. లై డిటెక్టర్ విచారణకు సిద్ధపడుదాం.. మొత్తం మీడియాను విచారణను లైవ్ పెట్టమని కోరుదాం.. ఎవరు దొంగో.. ఎవరు చేసిందో తప్పో అక్కడే తేలిపోతది..'' అని సవాల్ విసిరారు.
ఫార్ములా - ఈ రేస్ కేసులో ఈడీ, ఏసీబీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని పేర్కొన్నారు. ఏడు గంటల పాటు అడిగిందే అడగరా అన్నట్టుగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఏసీబీ 80 ప్రశ్నలు అడిగితే ఈడీ 40 ప్రశ్నలు వేసిందన్నారు. తనను ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని.. బాధ్యత గల పౌరుడిగా విచారణకు అన్నివిధాల సహకరిస్తానని ఈడీ అధికారులకు చెప్పానన్నారు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాంజాక్షన్ జరిగినప్పుడు ఇందులో అవినీతి ఎక్కడుంది.. మనీ లాండరింగ్ కు ఎక్కడ ఆస్కారముందని తాను ఈడీ అధికారులను ప్రశ్నించానని చెప్పారు. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు కాబట్టి ఆయనపై ఏసీబీ కేసు, ఈడీ కేసు పెట్టాయని.. కాబట్టే తనపై ఏసీబీ, ఈడీ కేసులు పెడుతున్నరని తెలిపారు. ''నన్ను విచారించే పేరుతో రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని నేను పత్రికల్లో ఈరోజు ఉదయమే చదవిన.. ఆ రూ.10 కోట్లు ఉంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొచ్చు.. ఇంకా కొందరు రైతులకు రుణమాఫీ చేయొచ్చు.. అందుకే నాపై విచారణ పేరుతో విలువైన ప్రజాధనం వృథా చేయొద్దు.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా చాలెంజ్ స్వీకరించి లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమవ్వాలే..'' అని మరోసారి చాలెంజ్ విసిరారు.