కొత్త మద్యం కంపెనీలకు రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌

యూబీ గ్రూప్‌ లాంటి వాటి ఒత్తిడికి తలొగ్గదన్న సీఎం

Advertisement
Update:2025-01-11 21:07 IST

తెలంగాణలో కొత్త మద్యం కంపెనీలు, కొత్త బ్రాండ్ల ఎంట్రీకి సీఎం రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. శనివారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎక్సైజ్‌ శాఖపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షించారు. యునైటెడ్‌ బ్రూవరీస్‌ గ్రూప్‌ తమ కంపెనీ బీర్ల రేట్లు 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సీఎం స్పందిస్తూ.. మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలు పరిశీలించాలని సూచించారు. హైకోర్టు జడ్జి నేతృత్వంలోని ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్సైజ్‌ శాఖకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో మద్యం సరఫరాకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేయడంలో పారదర్శకత పాటించాలన్నారు. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కు ఇప్పటికే మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు ఏవైనా కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు ముందుకు వస్తే సులభతర వాణిజ్య విధానం అమలు చేయాలన్నారు. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో మాత్రం కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లు తీసుకునేందుకు ముందుగా నోటిఫికేషన్‌ జారీ చేసి.. కనీసం నెల రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల సరఫరాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆయా కంపెనీలు సరఫరా చేస్తున్న మద్యం నాణ్యత ప్రమాణాలు, మద్యం సరఫరాలో ఆ కంపెనీకి ఉన్న సామర్థ్యం తదితర అంశాలన్ని పరిగణలోకి తీసుకొని అనుమతులు ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఎస్‌ శాంతి కుమారి, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్‌ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News