రేవంత్ సర్కారు కొత్త అప్పు.. ఎన్నివేల కోట్లంటే..?
పాత బాకీలకు తిరిగి చెల్లించాల్సిన సొమ్ము పెరుగుతున్నందు వల్ల కొత్తగా తీసుకునే రుణాల పరిమితిని కూడా కేంద్రం పెంచుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రేవంత్ సర్కారు కొత్త అప్పులు చేయబోతోంది. గతంలో తీసుకున్న అప్పులపై చెల్లించాల్సిన అసలు, వడ్డీలకు కిస్తీల ఆర్థికభారం పెరుగుతుండటంతో వచ్చే ఏడాది తీసుకోవాల్సిన రుణాల మొత్తాన్ని కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో తెలిపింది. వచ్చే ఏడాది (2024-25) సమకూరే మొత్తం రూ.2,74,186 కోట్లలో అప్పుల ద్వారా సేకరించే సొమ్ము రూ.68,585 కోట్లు ఉంటుందని వివరించింది. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పాతబాకీలకు తిరిగి చెల్లించాల్సింది రూ.39,753 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని తీసేస్తే మొత్తం రుణాలు రూ.68,585 కోట్లలో నికరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సొమ్ము రూ. 28,832 కోట్లు ఉండనుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్లు తీసుకుంటున్న రుణాలు మళ్లీ అదనంగా ఉంటున్నాయి. వీటిని ప్రభుత్వాలు బడ్జెట్‌లో చూపించడం లేదు.
పాత బాకీలకు తిరిగి చెల్లించాల్సిన సొమ్ము పెరుగుతున్నందు వల్ల కొత్తగా తీసుకునే రుణాల పరిమితిని కూడా కేంద్రం పెంచుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రూ.68,585 కోట్లు అప్పుల ద్వారా సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ రుణాల్లో మార్కెట్ల నుంచి బాండ్ల వేలం ద్వారా నేరుగా సేకరించేవి రూ.59,625 కోట్లు. కేంద్రం నుంచి తీసుకునేవి రూ.3,900 కోట్లు. ఇతర రుణాలు రూ.5,060 కోట్లు ఉంటాయని వివరించింది. కేంద్రం నుంచి తీసుకునే రుణాలు రూ.4,102 కోట్లు ఉంటాయని గత బడ్జెట్‌లోనూ అంచనా వేశారు.
కానీ, సవరించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది రూ.1,500 కోట్లే వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మార్కెట్ల నుంచి నేరుగా సేకరించిన రుణాలు గతేడాది రూ.40,150 కోట్లుంటే.. వచ్చే ఏడాది రూ.59,625 కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.