పాలపిట్ట రెక్కల రూపంలో శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్.. 28న పునఃప్రారంభం

కొత్తగా విస్తరించిన అంతర్జాతీయ టెర్మినల్‌ను పై నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్ర పక్షి 'పాలపిట్ట' రెక్కలు విప్పినట్లుగా కనపడుతుంది.

Advertisement
Update:2022-11-26 06:48 IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పునరుద్దరించబడిన అంతర్జాతీయ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న ప్రధాన టెర్మినల్ ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదని భావించిన జీఎంఆర్ యాజమాన్యం.. కొన్నాళ్ల క్రితం పునరుద్దరణ పనులు చేపట్టింది. అంతర్జాతీయ టెర్మినల్‌ను పక్కకు తాత్కాలికంగా మార్చింది. ప్రస్తుతం నిర్మాణం, సుందరీకరణ పనులు మొత్తం పూర్తి కావడంతో ఈ నెల 28న తిరిగి అంతర్జాతీయ టెర్మినల్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. కొత్తగా విస్తరించిన టెర్మినల్‌లో అనేక సదుపాయాలు కల్పించింది. గతంలో లేని టెక్నాలజీని కూడా వాడుకొని.. ప్రయాణికులకు పూర్తిగా నూతన అనుభూతిని అందించనున్నది.

కొత్తగా విస్తరించిన అంతర్జాతీయ టెర్మినల్‌ను పై నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్ర పక్షి 'పాలపిట్ట' రెక్కలు విప్పినట్లుగా కనపడుతుంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు గాల్లో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నామనే భావన కలిగించాలనే పాలపిట్ట డిజైన్‌ను ఎంచుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఇక ఇందులో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను కల్పించారు. ఇండివిడ్యువల్ కారియర్ సిస్టమ్, వైఫై 6, సెల్ఫ్ బ్యాగేజ్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు.

కొత్త టెర్మినల్‌లో 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 32 చెకిన్ కౌంటర్లు, 9 ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్స్, 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ మెషిన్లు, 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపాచర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు ఏర్పాటు చేశారు. గతంలో కంటే విదేశీ ప్రయాణికుల రద్దీ పెరగడంతో టెర్మినల్‌ను పూర్తి విశాలంగా మార్చారు. ప్రస్తుతం అంచనా వేస్తున్న ప్రయాణికుల రద్దీ కంటే 50 శాతం ఎక్కువ వచ్చినా.. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా టెర్మినల్‌ను రూపొందించారు. ఇక అంతర్జాతీయ స్థాయి లాంజ్‌లు కూడా ఏర్పాటు చేశారు. దేశంలో పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులకు అందిస్తున్న ఏకైక విమానాశ్రయం శంషాబాద్‌దే కావడం గమనార్హం.



Tags:    
Advertisement

Similar News