రామగుండం మార్గంలో రైల్వేలైన్ పునరుద్ధరణ
పెద్దపల్లి జిల్లా రాఘవాపురం – రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా రాఘవాపురం – రామగుండం మధ్య రైల్వేలైన్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇవాళ రాత్రి అప్‌లైన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. రాఘవపురం – రామగుండం మధ్య గూడ్స్ రైలును నడిపించిన అధికారులు విజయవంతంగా నడిపించారు. ఘటన జరిగిన దాదాపు 23 గంటల తర్వాత రైలు వెళ్లింది. మరికొద్ది గంటల్లో డౌన్ మార్గం సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.పెద్దపల్లి – రామగుండం మధ్య రాఘవాపూర్ మధ్య గూడ్స్ రైలు బోల్తాపడింది. ఐరన్ కాయిల్స్‌తో వెళ్తున్న రైలు ఓవర్ లోడ్‌తో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. ట్రిపుల్ లైన్ మధ్య నుంచి వెళ్తున్న గూడ్స్ అప్, డౌన్ మార్గాలపై బోల్తా కొట్టింది. బళ్లారి నుంచి ఘజియాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
దాంతో ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదం నేపథ్యంలో అధికారులు పలు రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దెబ్బతిన్న మూడు ట్రాక్‌లలో .. ఒకటి పెద్దపల్లి నుంచి రామగుండం వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పునరుద్ధరించారు. తొలుత ఆ మార్గంలో గూడ్స్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి ఈ మార్గంలో వన్‌వేలో ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి కాజీపేటకు రాత్రి 11 గంటలకు చేరుతుందని ప్రకటించారు. అర్ధరాత్రి 12గంటలకు పెద్దపల్లి చేరుకొనే విధంగా షెడ్యూల్ చేశారు. మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, కొత్త దిల్లీ మీదుగా శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు జమ్ముతావికి చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ బులెటిన్ విడుదల చేసింది.