తెలంగాణ రాడార్‌కు రిపేర్.. అందుకే భారీ వర్షాలను గుర్తించలేదా?

ప్రస్తుతం దీన్ని కేవలం తెలంగాణ కోసం మాత్రమే ప్రత్యేకంగా వాడుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ రిపోర్టులు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి.

Advertisement
Update:2022-07-19 12:59 IST

ఏదైనా ప్రాంతంలో వర్షం పడుతుందని ముందే ఎలా తెలుస్తుంది? సాధారణ, ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందే ఒక అంచనాకు ఎలా వస్తుంది? అంటే.. ఇలాంటి వాటికి సమాధానమే 'డాప్లర్ రాడార్'. ఇది మేఘాలను అధ్యయనం చేయడానికి వాడతారు. ఒక రాడార్ తనకు చుట్టూ 350 నుంచి 500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మేఘాలను పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అవి వర్షించే మేఘాలా? ఎంత సేపు వర్షించగలవు.. ఏ ప్రాంతంలో వర్షిస్తాయి అనే విషయాలను ఈ డాప్లర్ రాడార్ అంచనా వేస్తుంది. డాప్లర్ సిద్ధాంతం ప్రకారం పని చేస్తుంది కాబట్టే దీన్ని డాప్లర్ రాడార్ అంటారు.

ఇండియాలోని భూ భాగమంతటినీ కవర్ చేయాలంటే దాదాపు 100 డాప్లర్ రాడార్స్ అవసరమని కేంద్ర వాతావరణ శాఖ తేల్చింది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 రాడార్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్‌లో ఉన్నది. తెలంగాణలో వాతావరణ అంచనాలను ఈ రాడార్ ఇచ్చే డేటా సాయంతోనే చేస్తుంటారు. హైదరాబాద్‌లో ఉన్న డాప్లర్ రాడార్‌ను గతంలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల వాతావరణాల అంచనాలకు కూడా వాడారు. కానీ ప్రస్తుతం దీన్ని కేవలం తెలంగాణ కోసం మాత్రమే ప్రత్యేకంగా వాడుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ రిపోర్టులు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి.

అయితే హైదరాబాద్ రాడార్ ఈ ఏడాది జూన్ నుంచి పని చేయడం లేదని తెలుస్తున్నది. ఈ రాడార్ నుంచి తెలంగాణపై ఉన్న మేఘాలకు రేడియో సిగ్నల్స్ పంపించి.. వర్షపాతాన్ని అంచనా వేసే వీలుంది. పది రోజుల క్రితం ఉమ్మడి అదిలాబాద్ ప్రాంతంలో వర్షాలు భారీగా పడ్డాయి. కానీ దీనికి సంబంధించిన రిపోర్టు మాత్రం ముందుగానే ప్రభుత్వానికి చేరలేదు. తెలంగాణలో వర్షాలకు సంబంధించిన ఎలాంటి ముందస్తు రిపోర్టులు ఇవ్వడానికి రాడార్ పని చేయలేదు. దీంతో ప్రభుత్వం కూడా కాస్త ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది.

డాప్లర్ రాడార్‌లోని ఒక కాంపొనెంట్ గత కొన్ని వారాలుగా చెడిపోయింది. ఆ భాగాన్ని రిపేరు చేయడం కుదరదు. కొత్త కాంపొనెంట్‌ను తెచ్చి పాతదాని స్థానంలో అమర్చాల్సి ఉంది. అయితే సదరు కాంపొనెంట్ ఢిల్లీ నుంచి రప్పించాలి. ఐఎండీ అధికారులు కాంపోనెంట్‌ను మార్చడంలో ఆలస్యం చేయడం వల్లే.. కీలకమైన వర్షాకాలంలో హైదరాబాద్ డాప్లర్ పని చేయకుండా పోయినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత రెండున్నర ఏళ్లలో హైదరాబాద్ సహా మిగతా ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. ప్రతీ సీజన్‌లో జీహెచ్ఎంసీతో పాటు డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఈ డాప్లర్ రాడార్ నివేదికల ఆధారంగానే పని చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ వర్షాలు ఇంకా నమోదు కాలేదు. కానీ రాబోయే రోజుల్లో నగరానికి వరద ముప్పు పొంచి ఉన్నది. ఈ సమయంలో రాడార్ పని చేయకుండా పోవడం ఆందోళన కలిగిస్తున్నది.

కాగా, మంగళవారం కొత్త కాంపొనెంట్ ఢిల్లీ నుంచి విమానంలో వస్తున్నట్లు ఐఎండీ అధికారులు చెప్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రాడార్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నామని.. ప్రతినిత్యం మెయింటెనెన్స్ కూడా జరుపుతున్నామని అంటున్నారు. అయితే తొలిసారి కాంపొనెంట్ పాడయ్యిందని.. దాన్ని రెండ్రోజుల్లో రిప్లేస్ చేసి బాగుచేస్తామని ఐఎండీ సెంటిస్ట్ కే. నాగరత్న తెలిపారు. రాబోయే రోజుల్లో నగరంతో పాటు తెలంగాణలో ఎలాంటి వర్షపాతం నమోదు కానున్నదో ముందుగానే తెలియజేస్తామని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News