ప్రజలకు మెరుగైన సేవలందించేలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పునర్వ్యస్థీకరణ
గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు మెరుగైన సేవలందించేలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను పునర్వ్యస్థీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్ బిల్డింగులు నిర్మిస్తామని, ఇందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు వినియోగిస్తామని చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లతో ఆయన సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితి లేకుండా అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటికోసం భూములు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటే 37 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయని మిగిలిన అన్ని ఆఫీసులకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. మొదటి దశలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయం ఆవరణలో నిర్మిస్తామన్నారు. ఈ బిల్డింగ్ మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ భవనాలకు జనవరిలోనే శంకుస్థాపన చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కలిపి షేక్‌పేటలోని ఒకేచోట నిర్మిస్తామన్నారు. సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.