సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం
పిటిషనర్ జలగం వెంకట్రావుకు కోర్టుకు అయిన ఖర్చును భరించాలని.. అంతే కాకుండా వెంకట్రావు 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని హైకోర్టు ప్రకటించింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు సుప్రీకోర్టులో ఊరట లభించింది. వనమా ఎన్నిక చెల్లదంటూ, ఆయనను అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 15 రోజుల్లోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదంటూ జూలై 25న హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి, తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా అనర్హత వేటుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఈ కేసు వేసిన పిటిషనర్ జలగం వెంకట్రావుకు కోర్టుకు అయిన ఖర్చును భరించాలని.. అంతే కాకుండా 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని హైకోర్టు ప్రకటించింది. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరావు కాంగ్రెస్ తరపున, జలగం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. అప్పట్లో వనమా చేతిలో వెంకట్రావు ఓడిపోయారు. ఆ తర్వాత 2019 జనవరిలో వనమా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని చెబుతూ.. హైకోర్టులో కేసు వేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని వెంకట్రావు నాలుగేళ్లుగా పోరాడుతున్నారు.
ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు గత నెల 25న సంచలన తీర్పు ఇచ్చింది. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అప్పటి వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరినా తిరస్కరణకు గురైంది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో వనమాకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. కాంగ్రెస్ తరపున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు.