సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. ఈడీ విచారణ తీరుపై పిటిషన్ స్వీకరణ

సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. గతంలో ఈడీపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement
Update:2023-07-28 17:27 IST

ఢిల్లీ లిక్కర్ టెండర్ల కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో హాజరయ్యారు. కాగా, ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించవచ్చా అని నోటీసులు ఇచ్చిన సమయంలో కవిత ప్రశ్నించారు. తాను ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. తనను కార్యాలయానికి పిలిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. గతంలో ఈడీపై దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ కోసం మహిళను నేరుగా ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ కవిత వేసిన పిటిషన్‌ను.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

కవిత పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని.. ఆ పిటిషన్‌పై ఆరు వారాల్లోగా సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రెండు వారాల్లోగా రీజాయిండర్ దాఖలు చేయాలని ఎమ్మెల్సీ కవితకు సూచించింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ అడ్వొకేట్లు కపిల్ సిబాల్, ముకుల్ రోహద్గీ వాదనలు వినిపించారు. విచారణ సమయంలో తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ జే. రామచందర్ రావు కూడా హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News